‘బిడ్డా జ్వరంతో మంచం నుంచి లేవలేకపోతున్నా.. నన్ను ఈ రోజైనా వాగు దాటించి దవాఖానకు తీసుకెళ్లు’ అని ఓ తల్లి వేడుకోగా, గ్రామస్తుల సాయంతో తల్లిని భుజాలపై మోసుకుంటూ వాగును దాటించాడో కొడుకు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బోరిల్ గూడ గ్రామానికి చెందిన రాథోడ్ భూరిబాయి మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది.
అయితే భారీ వర్షాలతో అనార్పల్లి వాగు ఉప్పొంగడంతో దవాఖానకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అటు అంబులెన్స్ కూడా గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. ఎట్టకేలకు ఆదివారం వాగు ఉధృతి కొంత తగ్గగా, భూరిబాయిని గ్రామస్తుల సహకారంతో ఆమె కొడుకు రాథోడ్ రాందాస్ అనార్ పల్లి వాగు దాటించాడు.
అక్కడి నుంచి ఆటోలో కెరమెరి దవాఖానకు తరలించారు. అనార్ పల్లి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పదేళ్లుగా అసంపూర్తిగా ఉండడంతో తాము వర్షాలు పడినప్పుడల్లా ఇబ్బందులు పడుతున్నామని వాగు అవతలి గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
