- అతడి గర్ల్‌ఫ్రెండ్ సోషల్ మీడియా ద్వారా గుట్టురట్టు
కోల్‌కతా: బెంగాల్‌లో సంచలనం సృష్టించిన ఉగ్ర కుట్రను స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) భగ్నం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్‌తో సంబంధాలున్న హమీమ్ మండల్ అనే అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో పోలీసు యూనిఫామ్‌లో చొరబడి అల్లర్లు సృష్టించడంతో పాటు, సీఎంను లక్ష్యంగా చేసుకుని ఈ కుట్ర పన్నినట్లు ఎస్టీఎఫ్ వెల్లడించింది.
పాక్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు హమీమ్.. ఢిల్లీలోని జంతర్‌మంతర్ నిరసన ప్రదేశంలోకి పోలీసు డ్రెస్‌లో ప్రవేశించి అల్లర్లు సృష్టించాలని పథకం వేశాడని పేర్కొంది. సీఎం సువేందు కదలికలపై నిఘా ఉంచి, భద్రత లేని ప్రాంతాల సమాచారాన్ని సేకరించాలని ఉగ్రమూకలు ఆదేశించినట్లు పేర్కొంది.
సోషల్ మీడియా ద్వారా బయటపడిన పాకిస్తాన్ లింక్స్
ఈ ఉగ్ర నెట్‌వర్క్ వెనుక ప్రధాన పాత్రధారి అయిన హమీమ్ ప్రియురాలు అర్పితా సర్కార్‌ను జార్ఖండ్‌లో ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. ఆమె సోషల్ మీడియా అకౌంట్లు, వాట్సాప్ చాట్స్‌ను పరిశీలించగా పాకిస్తాన్ లింక్స్ బయటపడ్డాయి. రాష్ట్ర మంత్రి ఉమేశ్ రాయ్ కుమారుడిని హనీట్రాప్ ద్వారా కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని కుట్ర పన్నారు. అర్పితా ఇదివరకే పలువురు రాజకీయ నాయకులను హనీట్రాప్ చేసి కీలక సమాచారాన్ని హమీమ్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని కస్టడీకి తరలించారు.
