- నాబార్డ్ సౌజన్యంతో మహిళలకు ఉచితంగా శిక్షణ
- స్వయం ఉపాధికోసం మార్కెటింగ్‌కు తోడ్పాటు
మెదక్/ కొల్చారం, వెలుగు : తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ సంప్రదాయ చిత్రకళారూపమైన తంజావూర్ పెయింటింగ్స్‌లో స్వయం ఉపాధి కల్పించేందుకు నాబార్డ్ తో కలిసి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా మెదక్ జిల్లాలో ఎస్ హెచ్ జీ మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా మనోహరాబాద్ మండలం కూచారంలో తొలి బ్యాచ్‌లో 30 మందికి, కొల్చారం మండలం చిన్న ఘనపూర్ పరిధిలో రెండో బ్యాచ్‌లో మరో 30 మంది మహిళలకు నిపుణుల ద్వారా 20 రోజుల పాటు త్రీడీ డైమెన్షన్ (ఎంబోజ్డ్) పద్ధతిలో దేవుళ్ల రూపాలు, ప్రకృతి దృశ్యాలను క్యాన్వాస్‌లు, దుస్తులపై వేయడంలో ఉచిత శిక్షణ అందించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి కల్పించడంతో పాటు అవసరమైన మెటీరియల్ అందజేశారు.
రూ. వెయ్యి స్టైఫండ్, సర్టిఫికేట్..
శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి మహిళకు రూ. వెయ్యి స్టైఫండ్‌తో పాటు నాబార్డ్ ద్వారా అధికారిక సర్టిఫికేట్ అందజేశారు. మహిళలు తయారు చేసే ఈ అద్భుతమైన కళాఖండాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ కల్పించేందుకు, హైదరాబాద్‌లోని శిల్పారామం, గోల్కొండ వంటి ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవడానికి బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి పూర్తి స్థాయిలో మార్కెటింగ్ తోడ్పాటును అందిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని శిల్పారామం, గోల్కొండ వంటి చోట్ల దుకాణాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు.
