మెదక్ జిల్లాలో యథేచ్ఛగా అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్!

మెదక్ జిల్లాలో యథేచ్ఛగా అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్!

మెదక్, వెలుగు : మెదక్ జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మనోహరాబాద్, చేగుంట, చిన్నశంకరంపేట, శివ్వంపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు, వలస కార్మికుల అవసరాలను ఆసరాగా చేసుకుని డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్, చిన్న సిలిండర్లలోకి జనావాసాల మధ్యే అక్రమంగా ఫిలింగ్​ చేస్తున్నారు.

కొన్ని గ్యాస్ ఏజెన్సీల సహకారంతో సాగుతున్న ఈ ఇల్లీగల్ దందా వల్ల ఇటీవల మనోహరాబాద్ మండలం పరికిబండలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ అక్రమ కార్యకలాపాలపై స్పందించిన సివిల్ సప్లై అధికారులు ఆదివారం  చేగుంట పట్టణంలో జరిపిన ఆకస్మిక తనిఖీలలో పలు దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న రాజు, సురేశ్, మహేందర్ అనే ముగ్గురు వ్యక్తులపై  కేసులు నమోదు చేస్తామని సివిల్​ సప్లై అధికారులు తెలిపారు.