దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు

దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశంలో వర్షాకాలం ప్రారంభమైనా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో జులై నెలలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. వర్షాలు తగ్గడంతో పొలాలకు నీరందించడానికి రైతులు డీజిల్ పంపులను ఎక్కువగా వాడటం, రోడ్డు రవాణా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వ చమురు సంస్థల  ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేశాయి.  

గతేడాది జులైతో పోలిస్తే డీజిల్ విక్రయాలు ఈ ఏడాది జులైలో 10.7శాతం పెరిగి 71.2 లక్షల టన్నులకు చేరాయి. వ్యవసాయ నీటిపారుదల, ప్రాజెక్టు పనులు పెరగడమే ఇందుకు కారణం. మరోవైపు పెట్రోల్ అమ్మకాలు 9.7శాతం పెరిగి 34.5 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.  ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అమ్మకాలు 2.9శాతం స్వల్పంగా పెరిగి 6.59 లక్షల టన్నులకు చేరాయి. వంటగ్యాస్ విక్రయాలు మాత్రం 17.4శాతం తగ్గి 23.7 లక్షల టన్నులకు పడిపోయాయి.