- చమురు ఆచూకీ కోసం 60 బావులు తవ్వాలని ప్లాన్
- ఇందుకోసం ఒక్కో బావికి అయ్యే ఖర్చులో రూ.650 కోట్ల వరకు సబ్సిడీ
- రిస్క్ తగ్గడంతో ముందుకు రానున్న ప్రైవేట్ కంపెనీలు
- సముద్ర గర్బంలో కామన్ పైప్‌లైన్ వేయడానికి రూ.10 వేల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: దేశీయంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి,చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా జాతీయ బడ్జెట్ ద్వారా అత్యంత ప్రమాదకరమైన సముద్ర గర్భ చమురు, సహజ వాయువు అన్వేషణకు నిధులు సమకూర్చనుంది. తాజాగా ‘సముద్ర మంథన్ నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ మొత్తం బడ్జెట్ అంచనా రూ.84,084 కోట్లు. దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో లోతైన, అత్యంత లోతైన సముద్ర గర్భంలో చమురు ఉందో లేదో తెలుసుకోవడానికి 60 ఎక్స్‌ప్లోరేషన్ వెల్స్‌ను తవ్వనున్నారు.
స్కీమ్‌లో ఏముంది..?
ఒక్కో బావి తవ్వకానికి అయ్యే ఖర్చులో 50శాతం లేదా గరిష్టంగా రూ.650 కోట్లను నేరుగా ప్రభుత్వ బడ్జెట్ నుంచే సమకూరుస్తారు. దీని కోసం రూ. 43,200 కోట్లు కేటాయించారు. కనుగొన్న చమురు, గ్యాస్‌ను మార్కెట్‌కు తరలించడానికి నీటి అడుగున కామన్ పైప్‌లైన్లు, ప్రాసెసింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.10 వేల కోట్లు కేటాయించారు. దీంతో వేర్వేరు కంపెనీలు ఈ వసతులను కలిసి వాడుకోవచ్చు.
సముద్ర గర్భ సమాచారం, భూగర్భ సర్వేల కోసం రూ.28,534 కోట్లు, చమురు రంగానికి కావలసిన పారిశ్రామిక జోన్ల అభివృద్ధికి రూ.2 వేల కోట్లు కేటాయించారు. సముద్రపు లోతుల్లో బావులు తవ్వడం అత్యధిక ఖర్చుతో పాటు భారీ రిస్క్‌తో కూడుకున్న పని. ఒకవేళ అక్కడ చమురు లభించకపోతే ప్రైవేట్ కంపెనీలు పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అవుతుంది. అందువలనే ప్రైవేట్ కంపెనీలు చమురు నిల్వలను వెతికేందుకు ముందుకు రావడం లేదు. కేవలం ఆయిల్ ఉన్న బావుల నుంచే ఉత్పత్తి చేస్తున్నాయి.
ప్రభుత్వం సగం రిస్క్‌ను భరించడానికి ముందుకు రావడంతో.. ఎక్సాన్‌మొబిల్, షెల్ వంటి అంతర్జాతీయ ఎనర్జీ కంపెనీలు భారత సముద్ర జలాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతాయని అంచనా. ఓపెన్ ఎక్రియేజ్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ (ఓఏఎల్‌పీ) కింద బ్లాక్‌లు పొందిన కంపెనీలు ఈ సబ్సిడీ సదుపాయాన్ని పొందేందుకు అర్హత సాధిస్తాయి. ఈ ప్రోగ్రామ్ కింద కంపెనీలు తమకు నచ్చిన దగ్గర చమురు తవ్వకాలు జరపొచ్చు. ఇందుకోసం ఏడాదిలో ఎప్పుడైనా ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఒకే లైసెన్స్ కింద గ్యాస్, ఆయిల్, అన్ని రకాల హైడ్రోకార్బన్లను వెలికి తీయొచ్చు.
ఏటా 1.5 కోట్ల టన్నుల ఉత్పత్తి
భారతదేశం చమురు దిగుమతులపై ఆధారపడటం గత పదేళ్లలో 77శాతం నుంచి 88 శాతానికి పెరిగింది. అలాగే దేశానికి అవసరమైన సహజ వాయువులో సగానికి పైగా దిగుమతి చేసుకుంటున్నాం. కానీ, పశ్చిమాసియా యుద్ధాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల వంటివి మన సప్లయ్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఆర్థిక వ్యవస్థ ముందుకు నడవాలంటే నిరంతరంగా క్రూడాయిల్ సప్లయ్ అవుతుండాలి. దీనికోసం లోకల్‌గా ఉత్పత్తి పెంచుకోవడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సముద్ర మంథనం స్కీమ్ ద్వారా ఏటా కోటి నుంచి 1.5 కోట్ల టన్నుల చమురుకు సమానమైన అదనపు ఉత్పత్తి లభించే అవకాశం ఉందని, ఇది తక్షణమే దిగుమతులను 3 నుంచి 5 శాతం వరకు తగ్గిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తోంది.
