- మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది
- పెద్ద ఎత్తున ప్రజల తరలింపు
ఒలింపియా: అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో కార్చిచ్చు 2.50 లక్షలకుపైగా ఎకరాలకు వ్యాపించింది. రాష్ట్రవ్యాప్తంగా డజనుకుపైగా అటవీ ప్రాంతాలు మంటలకు ఆహుతవుతున్నాయి. మంటలను ఆర్పివేసేందుకు దాదాపు 4,000 మంది ఫైర్ సిబ్బంది పోరాడుతున్నట్లు అధికారులు తెలిపారు. అనేక చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ శనివారం ఉదయం రాష్ట్రవ్యాప్త ఎమర్జెన్సీని ప్రకటించారు. అదేవిధంగా నిప్పు రాజేయడంపై నిషేధం (బర్న్ బ్యాన్) విధించారు.
అయితే, ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. తూర్పు వాషింగ్టన్‌లో సుమారు 2,30,000 మంది నివాసితులు ఉండే స్పోకేన్ నగరంలో ‘ఓల్డ్ ట్రైల్స్ ఫైర్’ ప్రభావం తీవ్రంగా ఉందని, ఇది 3,000 ఎకరాలలో వ్యాపించి 4,000 ఇండ్లకు ముప్పు తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్పోకేన్ ప్రాంతంలో కార్చిచ్చు కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని.. 60,000 మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు చెప్పారు.
స్పోకేన్‌లోని నీటి పునరుద్ధరణ సౌకర్యాలు, వ్యర్థాల నుంచి ఇంధనం తయారీ ప్లాంటు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ఆసుపత్రితో సహా కొన్ని ప్రధాన సౌకర్యాలను ఖాళీ చేయించినట్లు మేయర్ లీసా బ్రౌన్ చెప్పారు. శనివారం మధ్యాహ్నం సమయానికి 200 ఇండ్లను ఖాళీ చేయించామన్నారు. ఈ వేసవి కాలంలో ఇప్పటివరకు వాషింగ్టన్ రాష్ట్రంలో సుమారు 4,50,000 ఎకరాలు కాలిపోయాయని చెప్పారు. ‘‘ఇది సాధారణం కాదు.. వాషింగ్టన్ రాష్ట్రం అంతటా మంటలు చెలరేగడాన్ని మేము చూస్తున్నాం’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
