నాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం

నాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం
  • భారీ మెజార్టీ ఇస్తామని మాటిస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా    
  • 2028 ఆగస్టు నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ, వెలుగు : 'వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తేనే నేను పోటీ చేస్తా లేకపోతే లేదు, నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం' అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఆదివారం నల్గొండ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ముందుగా తహసీల్దార్ ఆఫీసులో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కంచనపల్లిలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల మద్దతు, ప్రేమాభిమానాలు ఉన్నప్పుడే రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని చెప్పారు. నల్గోండ పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఇప్పటికే రూ.83 కోట్లతో వాటర్ ప్లాంట్‌‌‌‌కు శంకుస్థాపన చేశామని, మరో రూ.300 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. 

2028 ఆగస్టు నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తా

నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఎస్ఎల్బీసీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి చెప్పారు. 2028 ఆగస్టు నాటికి ఎస్ఎల్బీసీ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్లిస్తామని చెప్పారు. రూ. 11 కోట్లతో కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపడుతున్నామని, వచ్చే దసరా నాటికి పనులు పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు కావాలనే బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అడిషనల్ కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీలు గుమ్మల మోహన్ రెడ్డి, లక్ష్మయ్య, ఆర్ అండ్ బీ ఎస్ఈ మోహన్, పంచాయతీరాజ్ఈఈ గిరిధర్, ఆర్ అండ్ బీ ఈఈ  శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్ పరశురాం, ఎంపీడీవో యాకూబ్ పాల్గొన్నారు.