ఏఐ ఖర్చులు పెరగడంతోనే కొత్త జాబ్స్ రావట్లే

ఏఐ ఖర్చులు పెరగడంతోనే కొత్త జాబ్స్ రావట్లే

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సెంటర్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుండటంతోనే ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాలు రావడం లేదని ఐటీ సంస్థ 'జోహో కార్పొరేషన్' ఫౌండర్ శ్రీధర్ వేంబు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కొత్త ఉద్యోగుల శాలరీల కోసం కేటాయించే నిధులన్నీ ఇప్పుడు సర్వర్లు, మెమరీ ధరలు, ఏఐ మౌలిక వసతుల ఖర్చులకే సరిపోతున్నాయని ఆయన ఆదివారం సోషల్ మీడియా ఎక్స్‌‌లో పేర్కొన్నారు. 

ఉద్యోగాల కోత లేకున్నా.. నియామకాలు నిల్

జోహో సహా ప్రముఖ ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున లేఆఫ్స్ చేపట్టనప్పటికీ, గత కొన్నేళ్లుగా కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో విఫలమయ్యాయని వేంబు తెలిపారు.  కార్పొరేట్ క్లయింట్లు కూడా తమ ఐటీ బడ్జెట్‌‌లను ఏఐ వైపు మళ్లిస్తున్నారని, అయితే ఈ భారీ ఖర్చులపై  తగినంత లాభాలు పొందుతాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదన్నారు. తయారీ రంగంలో కూడా విపరీతంగా ఆటోమేషన్ పెరిగిపోవడం వల్ల అక్కడ కూడా కొత్త ఉద్యోగాలు రావడం లేదని తెలిపారు.

టెక్నాలజీ వల్ల వస్తువుల తయారీ ఖర్చు తగ్గి చౌకగా లభించినప్పటికీ, ప్రజల వద్ద వాటిని కొనుగోలు చేసేందుకు తగినంత ఆదాయం  ఉండేలా ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే ప్రస్తుత ప్రధాన సవాలని పేర్కొన్నారు. ఉద్యోగాల కొరత వేధిస్తున్న నేపథ్యంలో యూనివర్సల్ బేసిక్ ఇన్‌‌కమ్ (యూబీఐ) లేదా ఉచిత పథకాల వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.