మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. రాజమౌళి తన ప్రత్యేకమైన ప్లానింగ్‌తో మేజర్ పార్ట్‌ను ఎలాంటి ఆలస్యం లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తున్నారట. షెడ్యూల్స్‌ను ముందుగానే ప్లాన్ చేసుకుని, వాటిని కచ్చితంగా అమలు చేయడంతో షూటింగ్ అనుకున్న సమయానికే చివరి దశకు చేరుకుంది.
ప్రస్తుతం చివరి షెడ్యూల్స్ మాత్రమే మిగిలి ఉండగా, వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మరో కీలక షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ప్యాచ్‌వర్క్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు అనుకున్న ప్రకారమే సాగితే అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తికానుంది. అనంతరం విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, రీ-రికార్డింగ్ తదితర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ చేయనున్నారు. ఇక మహేష్ బాబు అభిమానులకు మరో సర్‌ప్రైజ్ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు టీమ్ రెడీ అవుతోందట. ఈ వీడియో ద్వారా సినిమా ప్రపంచం, మహేష్ బాబు పాత్ర లేదా చిత్ర కాన్సెప్ట్‌పై తొలి అధికారిక గ్లింప్స్ లభించే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది.
