న్యూఢిల్లీ: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బీజేపీలో అందరూ చందాల దొంగలు కాకపోవచ్చు కానీ.. చందాలు కొల్లగొట్టిన దొంగలంతా మాత్రం బీజేపీలోనే ఉన్నారని రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనేత ప్రమోద్ తివారీ సంచలన ఆరోపణలు చేశారు. రామాలయ విరాళాల చోరీ కేవలం ఇప్పుడు మొదలైంది కాదని ఏకంగా 'శిలా పూజ' నాటి నుంచే జరుగుతోందని మండిపడ్డారు.
ఆలయ నిర్మాణం బీజేపీ వల్ల జరగలేదని, సుప్రీంకోర్టు తీర్పు వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. చంపత్ రాయ్ జనరల్ సెక్రటరీగా ఉన్న కాలంలోనే కోట్ల రూపాయలు స్వాహా అయ్యాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల లబ్ధికోసమే ఆలయ నిర్మాణం పూర్తికాకుండానే ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారని దుయ్యబట్టారు.
ట్రస్ట్‌లోని ప్రతి సభ్యుడిని మోదీ తన ఇష్ట ప్రకారమే నియమించుకున్నారని.. మరి ఆ బాధ్యతలు అప్పగించిన వ్యక్తులు చేసిన పాపాలకు మోదీ ఎలా బాధ్యత వహించకుండా ఉంటారని ప్రశ్నించారు. ఈ అంశాన్ని సోమవారం పార్లమెంట్‌లోనూ లేవనెత్తుతామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది.
