జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ జంటగా అజయ్ భూపతి రూపొందించిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మించారు. జులై 30న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చెబుతూ టీమ్ సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు జై కృష్ణ తాతయ్య ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ, ప్రేక్షకులు, అభిమానులు సినిమాకు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. జై కృష్ణ తన తొలి చిత్రంతోనే హీరోగా మంచి గుర్తింపు సంపాదించాడని, కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
పద్మాలయ లెగసీని కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత జై కృష్ణపై ఉందని అన్నారు. హీరో జై కృష్ణ మాట్లాడుతూ, తొలి సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నాడు. అభిమానుల ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి నమ్మకాన్ని మంచి సినిమాలతో నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చాడు. మహేష్ బాబు తన నటనను మెచ్చుకోవడం జీవితాంతం గుర్తుండిపోయే క్షణమని చెప్పాడు. ఈ వీకెండ్ థియేటర్లలో 'శ్రీనివాస మంగాపురం'ను తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరాడు. కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలు కేఎస్ రామారావు, నవీన్ యెర్నేని, అనిల్ సుంకర, తమ్మారెడ్డి భరద్వాజలు కూడా జై కృష్ణ నటనను ప్రశంసించారు.
