టేక్మాల్, వెలుగు: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అండగా నిలిచారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లి గ్రామానికి చెందిన ఇర్ఫాన్ అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించారు.
ముగ్గురు కుమార్తెల పేర్లపై మొత్తం రూ.1.50 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించడంతో పాటు, ఒక చిన్నారికి మైనారిటీ పాఠశాలలో అడ్మిషన్ కల్పించారు. తక్షణ అవసరాల కోసం, దుస్తుల కొనుగోలుకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. మృతుడి భార్యకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకుడు వినోద్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు బసవరాజ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు నర్సింలు, సీనియర్ నాయకుడు మందిర్, వార్డు సభ్యుడు గోపాల్, అబూద్ పాల్గొన్నారు.
