ముంబై: యుద్ధ విమానాల తయారీ, ఏరోస్పేస్ రక్షణ రంగంలో మరింతగా విస్తరించడానికి మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసింది. తన డిఫెన్స్ విభాగం కింద 'నోవావాయు ఏరోస్పేస్ లిమిటెడ్' పేరుతో దీనిని రిజిస్టర్ చేసింది. జులై 29న నమోదైన ఈ కంపెనీ, 'మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్' (ఎండీఎస్‌ఎల్) కింద 'స్టెప్-డౌన్ సబ్సిడీ'గా పనిచేస్తుంది. దీనికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జులై 30న ఆమోదం తెలిపింది.
ఈ కొత్త సంస్థ రక్షణ రంగంలో విమానాలు, ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీ, సంబంధిత సేవలను అందించనుంది. ఈ కంపెనీ రూ. కోటి అథరైజ్డ్ షేర్ క్యాపిటల్, 10 లక్షల ఈక్విటీ షేర్లతో ఏర్పాటైంది. మహీంద్రా గ్రూప్ ఇప్పటికే డిఫెన్స్, ఆర్మర్డ్ వాహనాలు, నావికా వ్యవస్థల్లో విస్తరిస్తుండగా, కొత్తగా స్థాపించిన ఈ సంస్థ ద్వారా ఏరోస్పేస్ తయారీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
