- అమెరికాలో 19వ ఆటా మహాసభల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న 19వ ‘ఆటా’ మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విదేశీ మిత్రులకు మన రాష్ట్ర పర్యాటక వైభవాన్ని పరిచయం చేయాలని, సెలవుల్లో వారిని తెలంగాణకు తీసుకువచ్చి పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కోరారు.
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ఎన్నారై గ్రూపులు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా నుంచి వచ్చే ప్రవాసుల సౌలభ్యం కోసం హైదరాబాద్‌లో రూ.10 కోట్ల వ్యయంతో ‘ఎన్నారై భవన్’ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్భాటపు పెళ్లిళ్లకు దూరంగా ఉండాలని, సామాజిక రుగ్మతల నిర్మూలనకు త్వరలోనే ‘ప్రభాత భేరి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలుగువారి పాత్ర కీలకమని మంత్రి కొనియాడారు. మరోవైపు, అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ‘కమ్యూనిటీ సర్వీస్ అవార్డు’ను అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రదానం చేసింది. సమాజ సేవలో, విద్యా రంగంలో ఆయన చూపిన అంకితభావం, దూరదృష్టి, కార్యాచరణకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు.
