డ్రగ్స్‌‌‌‌తో కొద్దిసేపే కిక్కు.. జీవితమంతా చిక్కు: ప్రధాని మోదీ

డ్రగ్స్‌‌‌‌తో కొద్దిసేపే కిక్కు.. జీవితమంతా చిక్కు: ప్రధాని మోదీ
  •  
  • మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు ప్రధాని మోదీ పిలుపు
  • ‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ ప్రారంభం
  • దేశవ్యాప్తంగా 100 ఆదివారాల్లో 100 ప్రచార కార్యక్రమాలు 
  • డ్రగ్స్‌‌‌‌కు బానిసైన వారిపై వివక్ష చూపొద్దు.. వ్యసనం వదిలేలా సాయపడాలని సూచన

న్యూఢిల్లీ: మాదకద్రవ్యాలు కొద్దిసేపు కిక్కును ఇస్తాయని, కానీ అవి మొత్తం కెరీర్‌‌‌‌‌‌‌‌ను వ్యక్తిగత జీవితాన్ని పాతాళానికి తొక్కుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ యువత డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత భారత్ సంకల్ప్ అభియాన్’ వర్చువల్ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ యువత మానసికంగా శారీరకంగా ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలని, ఇందుకోసం అన్ని రకాల డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండటం ఎంతో అవసరమని చెప్పారు. యువత మన దేశ భవిష్యత్తు అని శత్రు దేశాలకు తెలుసునని, అందుకే వారు తమ ఉగ్రవాద ప్రణాళికలలో భాగంగా మాదకద్రవ్యాల సరఫరాను ఆయుధంగా వాడుకుంటున్నారని హెచ్చరించారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు బానిసైన వారి పట్ల సమాజంలో ఉన్న వివక్షను తొలగించాలన్నారు. డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడేవారు పోరాటయోధులని అన్నారు. ‘‘సమాజం వారిని గౌరవించాలి, హత్తుకోవాలి. వారికి మరో అవకాశం ఇవ్వాలి’’ అని కోరారు. ‘‘సమాజం మద్దతు, యోగా, ధ్యానం సహాయంతో మాదకద్రవ్యాల వ్యసనాన్ని వదిలించుకోవచ్చని మన సంస్కృతి మనకు నేర్పుతుంది” అని చెప్పారు. ‘నషా ముక్త్ యువా’ ప్రచారం అనేది వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి, ముఖ్యంగా దేశానికి ఒక సంకల్పమని, ఈ చొరవ పేరే దాని లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని తెలిపారు. ‘‘దేశం అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు, యువత శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండి ఆత్మవిశ్వాసం నిండి ఉండటానికి హానికరమైన వ్యసనాలకు దూరంగా ఉండటం అత్యవసరం. ఇదే ఈ ప్రచార ప్రధాన ఉద్దేశం”అని వెల్లడించారు.

100 ఆదివారాలు.. 100 అడుగులు..  

నషా ముక్త్ యువా అభియాన్ ప్రచార కార్యక్రమం 100 వారాల పాటు కొనసాగుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇది సామూహిక ఉద్యమంగా మారినప్పుడు.. నిస్సహాయ స్థితిలో ఉన్నవారు కూడా కొత్త శక్తిని పొందుతారన్నారు. ‘‘ఈరోజు తీసుకున్న సంకల్పం రాబోయే 100 వారాల పాటు అదే రీతిలో ముందుకు సాగుతుంది. ప్రతి ఆదివారం కళ, సంస్కృతి, క్రీడలు, ధ్యానం, ఆధ్యాత్మికత, చర్చలు, సేవా కార్యక్రమాలు జరుగుతాయి. వ్యసన విముక్తి సందేశం కొత్త వారికి చేరుతుంది. రాబోయే 100 ఆదివారాలు డ్రగ్స్ రహిత భారత్ వైపు 100 బలమైన అడుగులను సూచిస్తాయి’’ అని మోదీ చెప్పారు. వ్యసనం శరీరాన్ని హాని చేయడమే కాకుండా, తల్లి చిరునవ్వును లాగేస్తుందని, తండ్రి కలలను ఛిద్రం చేస్తుందని, చెల్లెలు ఆశను బలహీనపరుస్తుందని, తమ్ముడి గౌరవాన్ని హరిస్తుందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ‘‘దేశవ్యాప్తంగా డ్రగ్స్ స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే అరెస్టులు అనేక రెట్లు పెరిగాయి. వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం”అని  చెప్పారు. సామాజిక ప్రతిష్ట గురించి ఆలోచించి తల్లిదండ్రులు తమ పిల్లల వ్యసనాన్ని దాచవద్దని.. మాదకద్రవ్యాల వ్యసనాన్ని అధిగమించడానికి డాక్టర్ల, నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు. కాగా, డ్రగ్స్ రహిత భారత్‌‌‌‌‌‌‌‌ను సృష్టించాలనే ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా 2020లో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ తొలిసారి ప్రారంభమైందని కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల మంత్రి మన్‌‌‌‌‌‌‌‌సుఖ్ మాండవీయ తెలిపారు.