పాపికొండల పర్యాటకానికి బ్రేక్ .. శ్రీరాంసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకి భారీగా వరద..మూడు రోజుల్లో 13 టీఎంసీలు..

పాపికొండల  పర్యాటకానికి బ్రేక్ .. శ్రీరాంసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకి  భారీగా వరద..మూడు రోజుల్లో 13 టీఎంసీలు..
  • భద్రాచలం వద్ద మూడో ప్రమాదహెచ్చరిక జారీ 
  • జలదిగ్బంధంలో బూర్గంపహాడ్
  • పొంగుతున్న ప్రాణహిత, వార్ధా
  • పలు గ్రామాల్లో నిలిచిన రాకపోకలు
  • ఇంకా కొనసాగుతున్న గోదావరి  ఉధృతి

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌/భద్రాచలం/బూర్గంపహాడ్/కాగజ్​నగర్, వెలుగు: శ్రీరాంసాగర్  ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం 85,266 క్యూసెక్కుల ఇన్​ఫ్లో నమోదైంది. మహారాష్ట్రలోని గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విష్ణుపురి, బాలేగాం‌‌‌‌‌‌‌‌, బాబ్లీ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో శనివారం రాత్రి 8 గంటలకు ప్రాజెక్టు నీటి మట్టం 29 టీఎంసీలకు చేరుకుంది. జులై 29న ప్రాజెక్టులో 16 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, మూడు రోజుల్లో 29 టీఎంసీలకు చేరింది. మరో రెండు రోజుల్లో 42 టీఎంసీలకు చేరుతుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే నిరుడు ఆగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1న ఎస్సారెస్పీలో 38 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

భద్రాచలం వద్ద ప్రమాదకరంగా..


భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరుకోగా, కలెక్టర్​ అంకిత్​ మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గరిష్టంగా 56.10 అడుగుల(15,96,899 క్యూసెక్కుల ప్రవాహం)కు చేరిన తర్వాత శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నిలకడగామారి తగ్గుముఖం పట్టింది. భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే తూరుబాక, కుదునూరు, ఆలుబాక వద్ద రోడ్లు మునిగిపోయాయి. విజయవాడ–-జగదల్​పూర్​ హైవేలో భద్రాచ లం, విలీన ఎటపాక మండలం నెల్లిపాక వద్ద రోడ్లు మూతపడ్డాయి. దీంతో ఏపీ, ఛత్తీస్​గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాపికొండల టూరిజానికి బ్రేక్​ పడింది. 

దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయానికి వెళ్లే మార్గం కూడా గోదావరి బ్యాక్ వాటర్​తో ముంపునకు గురైంది. దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను తరలించారు. నాటుపడవలపై ప్రయాణాలు, చేపల వేటను నిషేధించారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో బూర్గంపహాడ్  మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో బూర్గంపహాడ్, -కుక్కునూరు, భద్రాచలం, ఇరివెండి,- అశ్వాపురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

అధికారులు శుక్రవారం రాత్రి నుంచి  ముంపు గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్తగా ఇండ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాత సారపాక, ఇరివెండి, మోతే గ్రామాల్లో ఇండ్లు నీట మునిగాయి. 75 ఫ్యామిలీలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంపు ప్రాంతాలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సందర్శించి బాధితులకు భరోసా కల్పించారు.

బ్రిడ్జిల మీదకు చేరిన వరద నీరు

వార్ధా, ప్రాణహిత నదుల్లో వరద ఉధృతి పెరగడంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బ్యాక్‌‌‌‌‌‌‌‌వాటర్ తో కుమురంభీం ఆసిఫాబాద్  జిల్లా సిర్పూర్(టి) మండలం నుంచి మహారాష్ట్రకు వెళ్లే వెంకట్రావుపేట హై లెవెల్  బ్రిడ్జి, హుడ్కులిలో లీవెన్  వంతెనపై నీళ్లు పారడంతో రెండు ప్రధాన మార్గాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు మండలాల్లోని వంద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వంతెనల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. ప్రాణహిత, వార్ధా నదుల బ్యాక్‌‌‌‌‌‌‌‌వాటర్  ప్రభావంతో సిర్పూర్(టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్, దహేగాం, పెంచికల్‌‌‌‌‌‌‌‌పేట్  మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు, చేలు నీటమునిగాయి.

జూరాలలో 29 గేట్లు ఓపెన్

గద్వాల: జూరాల ప్రాజెక్టుకు రోజురోజుకు వరద పెరుగుతోంది. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్  డ్యామ్ లతో పాటు భీమా నది నుంచి వరద కొనసాగుతోంది. దీంతో శనివారం జూరాల ప్రాజెక్టు 29 గేట్లను ఓపెన్  చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాం దగ్గర 518.97 మీటర్ల లెవెల్  నీటిని నిల్వ ఉంచుకొని 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని నారాయణపూర్  డ్యామ్ కు వదులుతున్నారు.

ఆల్మట్టి ప్రాజెక్టుకు 96,445 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండగా, నారాయణపూర్ డ్యామ్  వద్ద 491.42 మీటర్ల లెవెల్ ను మెయింటెన్​ చేస్తూ 29 గేట్లను ఓపెన్  చేసి 1,05,474 క్యూసెక్కుల నీటిని జూరాల ప్రాజెక్టుకు వదులుతున్నారు. భీమా నది నుంచి 55వేల క్యూసెక్కుల ఇన్  ఫ్లో కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టులో 317. 90 లెవెల్ ను మెయింటెన్​ చేస్తూ 29 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వరద గేట్ల ద్వారా 1,46,018 క్యూసెక్కులు, విద్యుత్  ఉత్పత్తి కోసం 36,603 క్యూసెక్కులు రిలీజ్​ చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1,70 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లోగా కొనసాగుతుండగా, 1,79,023 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు.