ధరణి పేరుతో కేసీఆర్ అండ్ కో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ముసుగులో దోచుకున్నారని అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి అనేది కొత్తది కాదని.. అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో.. భూ రికార్డులు డిజిటల్ చేయటానికి భూ భారతి పేరుతో కొత్త విధానం తీసుకొచ్చారని స్పష్టం చేశారు సీఎం రేవంత్. అప్పట్లో భూ భారతికి ఐదేళ్ల కాలానికి.. భూ రికార్డులు డిజిటల్ చేయటానికి 110 కోట్ల రూపాయలు వ్యయం అంచనా వేసినట్లు వెల్లడించారు.
ఆ తర్వాత కేసీఆర్.. అదే భూ భారతిని.. ధరణిగా మార్చారని.. భూ రికార్డులు కేవలం డిజిటల్ చేయటానికి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 110 కోట్లు అంచనా వేస్తే.. ధరణి పేరుతో కేసీఆర్ 1350 కోట్ల రూపాయలకు పెంచారని.. అంచనా వ్యయం ఇంత ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు సీఎం రేవంత్. ధరణి కాంట్రాక్ట్ 1350 కోట్ల రూపాయలకు పెరిగిన తర్వాత.. విదేశీ శక్తులు ప్రవేశించాయని.. ధరణి పేరుతో భూ రికార్డులు కేవలం డిజిటల్ చేయాల్సి ఉండగా.. కేసీఆర్ మాత్రం భూ రికార్డులు అన్నింటినీ మార్చేసి.. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల పేరుతో వాటిని రిజిస్ట్రర్ చేశారంటూ వెల్లడించారు సీఎం రేవంత్.
ALSO READ : ధరణి పేరుతో విదేశాల్లోని మాఫియా చేతికి తెలంగాణ భూముల వివరాలు
ధరణి చట్టం కింద విదేశీ పెట్టుబడులు ఎలా వస్తాయని కేసీఆర్ ను నిలదీసిన సీఎం రేవంత్ రెడ్డి.. దీని వెనక ఉన్న డార్క్ కంపెనీలు, డొల్ల కంపెనీల వివరాలను వెల్లడించారు. ధరణి అనే భూతం వల్లే ఇప్పుడు తెలంగాణలో భూ సమస్యలు పెరిగాయని.. ధరణిని కేసీఆర్ భూ దోపిడీకి ఉపయోగించుకున్నారని.. భూములను కొట్టేశారని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
