మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల విందు..హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల విందు..హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్​ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ క్వార్టర్స్ లోని తన అధికార నివాసంలో ఆదివారం విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు అటెండ్ అయ్యారు. పొన్నం ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కుటుంబసభ్యులు బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. విందులో మంత్రి పొన్నం గెస్ట్​లకు తెలంగాణ సంప్రదాయ వంటకాలను వడ్డించారు.

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లి మల్లమ్మ, సతీమణి మంజుల, కుమారులు పృథ్వీ, ప్రణవ్, వారి సోదరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, సంప్రదాయం, ఆతిథ్యానికి ప్రతీకగా నిలవడంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఆత్మీయ సమావేశంగా నిలిచింది.