సీఎంఆర్ రైస్లో ఫ్రాడ్..సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ లో రూ.2 కోట్ల అవినీతి?

సీఎంఆర్ రైస్లో ఫ్రాడ్..సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ లో రూ.2 కోట్ల అవినీతి?

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా సివిల్ సప్లయ్స్ శాఖలో బియ్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మిల్లుల నుంచి సీఎంఆర్ బియ్యం గోదాంలకు రాకుండానే వచ్చినట్లు ఫేక్ ఐడీ సృష్టించి ఆన్‌‌లైన్ రికార్డుల్లో ఎంట్రీ చేసినట్లు బయటపడింది. ఈ వ్యవహారంలో కార్యాలయంలో పనిచేసే ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి మిల్లులకు అప్పగిస్తుంది.

మిల్లులు వాటిని మిల్లింగ్ చేసి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) రూపంలో బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. అయితే జిల్లాలోని రెండు రైస్ మిల్లుల నుంచి బియ్యం గోదాంలకు రాకపోయినా, వచ్చినట్లు సివిల్ సప్లయీస్​ డీఎం కార్యాలయంలో ఆన్‌‌లైన్ ఎంట్రీ చేసినట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా మిల్లుల నుంచి బియ్యం గోదాంలకు చేరిన తర్వాత సివిల్ సప్లయ్స్ అధికారులు, గోదాం సిబ్బంది రికార్డులు సరిపోల్చి ధ్రువీకరిస్తారు.

కానీ స్టాక్ రాకుండానే వచ్చినట్లు చూపించడంతో అనుమానం వచ్చి లోతుగా విచారణ చేపట్టారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన బియ్యానికి సంబంధించి ఈ అక్రమ ఎంట్రీలు జరిగినట్లు అంచనా. సంబంధిత కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు. ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌‌గా తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే వివరాలను పోలీసులకు 
అందజేశారు.

డిఫాల్ట్​ జాబితాలో 20 మిల్లులు..


సీఎంఆర్ బియ్యం గడువులోగా ఇవ్వని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఆర్‌‌ఆర్ యాక్ట్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2024–25 సీజన్‌‌కు సంబంధించి జిల్లాలో సుమారు 20 మిల్లులు డిఫాల్ట్ జాబితాలో ఉన్నట్లు సమాచారం. బియ్యం అప్పగించని మిల్లులపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ ఫేక్ ఎంట్రీల వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. గతంలో కూడా ఇలాంటి అక్రమాలు జరిగాయా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.