- రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి అందజేత
- వచ్చే వారంలో మహారాష్ట్ర సీఎంతో మీటింగ్ ఉండే చాన్స్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అక్కడ హైడ్రాలజీ స్టడీస్, ఫీజిబిలిటీ స్టడీస్ సహా అన్ని అధ్యయనాలు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. నేల పరిస్థితులు తెలుసుకునేందుకు చేస్తున్న జియోటెక్నికల్ టెస్టులు కూడా పూర్తయి రిపోర్టులు త్వరలోనే వస్తాయంటున్నారు.
మహారాష్ట్ర సీఎంతో సమావేశం ఖాయం అయిన నేపథ్యంలో అధికారులు.. డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)పైనా దృష్టి సారించి వేగంగా పనులు చేస్తున్నారు. ఆ డీపీఆర్ కూడా దాదాపు పూర్తయినట్లు అధికారులు చెప్తున్నారు. ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ డీపీఆర్‌ను పూర్తి చేసిందని, రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.
అందులో హైడ్రాలజీకి సంబంధించి కీలక విషయాలు పేర్కొన్నట్టు సమాచారం. 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మిస్తే.. దాదాపు 129 టీఎంసీల జలాలను తరలించుకునే ఆస్కారం ఉందని పేర్కొన్నట్టు తెలిసింది. అదే సమయంలో 149.5 మీటర్ల ఎత్తులో కడితే 108 టీఎంసీల వరకు జల లభ్యత ఉండే చాన్సెస్ ఉన్నాయని డీపీఆర్‌లో పేర్కొన్నట్టు చెబుతున్నారు. డీపీఆర్ ప్రభుత్వానికి చేరిన వెంటనే దానిపై రివ్యూ చేసి.. మహారాష్ట్ర సీఎంతో భేటీకి డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. వచ్చేవారం మీటింగ్ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.
రెండు బ్యారేజీలుగా నిర్మాణం..
తుమ్మిడిహెట్టి విషయంలో గతంలో ఒక బ్యారేజీగా నిర్మిస్తే 45 డిగ్రీల వంపు (క్యూ) వచ్చి వరదలతో బ్యారేజీ నిర్మాణానికి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ క్రమంలోనే ఈసారి బ్యారేజీ స్ట్రక్చర్పైనా అధికారులు దృష్టి సారించారు. బ్యారేజీ ఎత్తు, క్యూస్, వరద ప్రవాహాలు, కాలువల అలైన్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించి స్టడీలు చేశారు. క్యూను తప్పించేందుకు ఒకటిగాకాకుండా రెండు బ్యారేజీలుగా నిర్మించాలని అధ్యయనంలో తేల్చారు.
ఈ క్రమంలోనే 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మిస్తే వైన్‌గంగ, వార్ధాలపై బ్యారేజీలు నిర్మించి.. ఆ రెండింటిని కలిపేలా కాంక్రీట్బండ్ను లంభకోణంలో నిర్మించాలని సూచించారు. దాని వల్ల వరదపోటు తగిలినా బ్యారేజీ స్ట్రక్చర్‌కు ఎలాంటి ముప్పు ఉండదని చెబుతున్నారు. ఈ విషయాన్ని కూడా డీపీఆర్‌లో పొందుపరిచినట్టు తెలిసింది. ఈ రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పిస్తే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది
