ఆరుతడి వైపు అన్నదాత! ఎల్నినో ఎఫెక్ట్తో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు

ఆరుతడి వైపు అన్నదాత! ఎల్నినో ఎఫెక్ట్తో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు
  • పనిచేసిన ప్రభుత్వ ప్రచారం.. వాతావరణశాఖ హెచ్చరికలు
  • గణనీయంగా తగ్గుతున్న వరి సాగు 
  • ఆ స్థానంలో మక్క, జొన్న, పప్పులు, నూనె గింజలు

 నెట్​వర్క్​, వెలుగు:ఎల్​నినో ఎఫెక్ట్​తో రాష్ట్రంలోని అన్నదాతలు ఆరుతడి పంటల వైపు మళ్లుతున్నారు. వానకాలం సీజన్​లో సాధారణంగా మన రైతులు వరి, పత్తి ఎక్కువ సాగుచేస్తుంటారు. కానీ, ఈ సీజన్​లో ఇప్పటివరకు భారీ వర్షాలు పడకపోవడం, ప్రాజెక్టులకు ప్రవాహాలు రాకపోవడం, భూగర్భజలాలు కూడా తగ్గడంతో మనసు మార్చుకుంటున్నారు.

వరికి ప్రత్యామ్నాయంగా కంది, మక్క, జొన్న, సోయా, పల్లి, నువ్వు వంటి పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈసారి వాతావరణశాఖ చేసిన ముందస్తు హెచ్చరికలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వరికి బదులు ఆరుతడి పంటలను సాగుచేయాలని పిలుపునివ్వడం, వ్యవసాయ అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కూడా కలిసివచ్చింది. అందుకు తగినట్లే వ్యవసాయ, హార్టికల్చర్​ శాఖలు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రైతువేదికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్​ అయ్యాయి. ఫలితంగా గతంలో వరి వద్దని ఎంత ప్రచారం చేసినా పట్టించుకోని రైతులు ఈసారి మాత్రం అనావృష్టి కారణంగా ఆరుతడి పంటలకే జైకొడ్తున్నారు. 

10 లక్షల ఎకరాల్లోనే వరినాట్లు.. 

వానాకాలంలో రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 60.22 లక్షల ఎకరాల్లోనే రైతులు వివిధ పంటలు సాగుచేశారు. దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఇంకా విత్తనాలు పడలేదు. ఇక రాష్ట్రంలో సాధారణ వరి సాగు 60 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 10 లక్షల ఎకరాలలోపే సాగైంది. అదే  పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 47.41లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 41.12 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది.

ఇక మక్కలు 3.63 లక్షల ఎకరాల్లో, కంది 3.53 లక్షల ఎకరాల్లో, సోయాబీన్  3.35 లక్షల ఎకరాల్లో, పెసర్లు 44,646 ఎకరాల్లో, మినుములు 11,246 ఎకరాల్లో, జొన్నలు 16,865 ఎకరాల్లో సాగైనట్లు  వ్యవసాయ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఇకపై వర్షాలు పడినా గతంతో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గుతుందని, ఆ స్థానంలో ఆరుతడి పంటలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  

జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. 

ఉమ్మడి వరంగల్​ జిల్లా రైతులు పత్తి, మొక్కజొన్న, కందులు, పెసర్లు, కొంతమేర పల్లి సాగుచేస్తున్నారు. వరికి సాగుకు పెట్టింది పేరైన ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ రైతులు వరికి బదులు ఈసారి పత్తి, కందివైపు మొగ్గుచూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంగా పత్తి, సోయా సాగు చేస్తారు. ఈసారి పత్తికి బదులు సోయా, కంది పంటలతో పాటు కొంత మేర మినుములు సాగు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సీజన్​లో వరి సాగు సగానికి తగ్గింది. గత సీజన్​లో 47,228 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి కేవలం 23,100 ఎకరాలకే పరిమితమయ్యారు.

ప్రత్యామ్నాయంగా కందులు ,పెసర్లు, మొక్కజొన్న, జొన్న, మినుములు, కూరగాయలు  36,721 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో ఎస్సారెస్పీ నీటి విడుదలపై అనుమానాలు ఉన్నాయి. దీంతో రైతులు వరిని తగ్గించి, మక్క, పత్తి, కంది, పెసర వంటి పప్పు ధాన్యాలతో పాటు పల్లి లాంటి నూనెగింజల వైపు మొగ్గుచూపుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో వానాకాలం 2 లక్షల ఎకరాల్లో వరి, 60 వేల ఎకరాల్లో పత్తి వేసేవారు. ఈసారి ఇంకా 30 వేల ఎకరాల్లో కూడా నాట్లు పడలేదు. వరికి బదులుగా మక్కజొన్న, కందులు, ఇతర పప్పు ధాన్యాలు, నువ్వులు, జొన్నలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. నాగర్ కర్నూల్  జిల్లాలోనూ వరి సాగు తగ్గనుంది. బదులుగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. కేఎల్ఐ కాల్వలకు నీరు విడిచే పరిస్థితి లేకపోవడంతో కాల్వల కింద సైతం కందులు, మినుములు, నువ్వులు, మొక్కజొన్న వేస్తున్నారు. ఆగస్టు వరకు చూసి పల్లీ సాగు చేయాలన్న ఆలోచనలో మరికొందరు  రైతులు ఉన్నట్టు 
తెలుస్తోంది.  

వరికి బదులు పత్తి  సాగు చేస్తున్న..

నా సొంత భూమితో పాటు కౌలు భూమి కలిపి  22ఎకరాలలో పంట సాగు చేస్తున్నాను. ప్రస్తుతం బావిలో నీళ్లుండడంతో 10 ఎకరాల్లో వరి సాగు కోసం నారు పోశాను. వర్షాభావం కారణంగా సరిపడా నీటి వసతి లేని 12 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాను. కొన్నేళ్లుగా 3 ఎకరాల్లో పత్తి వేసి మిగతా వరి సాగు చేసేవాడిని, ఈసారి వర్షాభావం వల్ల  12 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. కాలం ఇట్లాగే ఉంటే మిగిలిన 10 ఎకరాల్లో కూడా  ఆరుతడి పంటలు వేస్త. –కల్లెం లక్ష్మారెడ్డి, 
చొప్పదండి, కరీంనగర్​ జిల్లా

పత్తి మొత్తానికి బంద్ చేసిన..

ప్రతి ఏడాది నాకు సొంతంగా ఉన్న ఐదు ఎకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు పట్టుకుని పత్తి, సోయా సాగు చేశాను. ఈసారి వర్షాభావ పరిస్థితులతో కౌలుకు భూమి తీసుకోలేదు . నా ఐదు ఎకరాల్లో పత్తికి బదులు సోయా పంట వేసుకున్న.
చంద్రశేఖర్, అంకోలి, ఆదిలాబాద్ జిల్లా

వరికి బదులు మిర్చి సాగు చేస్తున్న
మూడు ఎకరాల్లో ప్రతి ఏడాది సాగర్  ఎడమ కాలువ నీటితో వరి సాగు చేసేవాడిని. ఈసారి ఎల్ నినో కారణంగా వర్షాభావం, నీటికొరత వల్ల బోరు కింద  మిర్చి సాగు చేస్తున్న. -  గానుతల గోవర్ధన్ రెడ్డి, నెల్లికల్లు, సూర్యాపేట జిల్లా

 కూరగాయలు వేశా..
ఈ ఏడాది వర్షాభావం వల్ల వరి పంట కాకుండా కూరగాయలు పండిస్తున్న. వరి వేస్తే నీళ్లు అందక నష్టపోతారని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో తొందరగా చేతికి వచ్చే కూరగాయలు వేశాను. వర్షభావంతో కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. దాంతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయి.  – జంగాల రాఘవులు, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా

ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు
 నాకున్న మూడెకరాలతో పాటు రెండెకరాలు కౌలుకు తీసుకొని వరి పంట వేస్తుంటి. ఈసారి వర్షాలు లేక రెండు ఎకరాల్లో మక్కజొన్న పంట సాగు చేస్తున్న. మిగిలిన పొలంలో ఆరు తడి పంటలు వేయాలనుకుంటున్న. వ్యవసాయ అధికారులతో మాట్లాడి  ఏ పంట వేయాలో నిర్ణయం  తీసుకుంటాను. –కొంగరి మహేశ్‌‌‌‌‌‌‌‌, తొగుట, సిద్దిపేట జిల్లా

అల్కటి పంటలు వేస్తున్నా
నేను ఎప్పుడు తొమ్మిది ఎకరాల్లో వరి పంట వేస్తుంటి. అసొంటిది ఇప్పుడు వానలు పడయని అగ్రికల్చర్  ఆఫీసర్లు చెప్పడంతో రెండు ఎకరాల్లో పత్తి అలికిన. ఇంకా నాలుగు ఎకరాల్లో తక్కువ నీళ్లతో పండే జొన్న అలుకుదమని అనుకుంటున్న. వానలు పడుతలేవు. అల్కటి పంటలు వేసుకొంటేనే మంచిది.   
–రెడ్డి బాలరాజు, చల్మెడ, మెదక్ జిల్లా