పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తాం : డీజీపీ సీవీ ఆనంద్

పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తాం : డీజీపీ సీవీ ఆనంద్
  • పోలీస్ యాప్స్ ఆధునికీకరణపై ఫోకస్ పెడతాం డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పోలీసు శాఖను మరింత బలోపేతం చేసే దిశగా రవాణా, పరిపాలనా, సాంకేతిక రంగాల్లో కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు  డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో పోలీసు శాఖకు సంబంధించిన పలు విధానపరమైన, పరిపాలనా, సాంకేతిక అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణహాని లేని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల వద్ద నుంచి పోలీసు భద్రతను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. మావోయిస్టు ముప్పు పేరుతో అవసరానికి మించి కల్పించిన ఈ భద్రతను తొలగించడం ద్వారా సుమారు 400 మంది సిబ్బందితోపాటు అనేక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తిరిగి పోలీసు శాఖకు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ప్రస్తుతం వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎలైట్ కమాండో దళాలైన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ యూనిట్లను ఒకే క్యాంపస్ నుంచి నిర్వహించే అంశంపై అధికారులతో చర్చించామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ, కంప్యూటర్ సర్వీసెస్ విభాగాన్ని ఆధునీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. సిటిజన్, పోలీస్ సేవల యాప్‌లైన సీసీటీఎన్‌ఎస్, టీజీ-కాప్, హాక్ఐలను '3.0' వర్షన్లకు ఆధునీకరించే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా తెలంగాణ పోలీస్ మాన్యువల్‌కు తుది రూపం ఇవ్వడంతో పాటు, ఐపీఎస్ అధికారుల యూనిఫామ్‌లో క్రాస్ బెల్ట్‌లు, లాఠీల వంటి సంప్రదాయ అంశాల్లో చేయాల్సిన మార్పులపై పలు సూచనలు చేశారు. సమావేశంలో వివిధ కేడర్ల అధికారులు తెలిపిన అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ పోలీసు శాఖ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని డీజీపీ వెల్లడించారు.