- స్థానికత పరిధిపై పూర్తి స్పష్టత రావాలని వెల్లడి
- తుది విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను విభజించినప్పుడు స్థానికత పరిధిని ఎలా నిర్ధారించాలనే దానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి) కింద జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ నియామకాలపై దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత 2011 జనాభా ప్రాతిపదికన పోస్టులను కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం 2022లో జీవో 46ను తీసుకొచ్చిందని పిటిషనర్లు తెలిపారు.
ఈ జీవో ప్రకారం మొత్తం పోలీస్ పోస్టుల్లో దాదాపు 53 శాతం ఒక్క ఉమ్మడి హైదరాబాద్ (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) కమిషనరేట్ల పరిధికే కేటాయించారని, మిగిలిన 27 జిల్లాల అభ్యర్థులకు కేవలం 47 శాతం పోస్టులే లభించాయని వివరించారు. దీనివల్ల ఒకే కేటగిరీ అభ్యర్థులకు జిల్లాలను బట్టి వేర్వేరు కటాఫ్ మార్కులు వచ్చి తీవ్ర అన్యాయం జరిగిందని ఎం.శ్రీకాంత్ సహా 74 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఒకే రిజర్వేషన్ కేటగిరీకి వేర్వేరు కటాఫ్‌లు పెట్టడం సమానత్వ హక్కుకు విరుద్ధమని, కాబట్టి భర్తీ కాకుండా మిగిలిపోయిన 400 పోస్టులను అర్హత సాధించిన అభ్యర్థులకు కేటాయించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల న్యాయవాదులు కోరారు. దీనిపై ధర్మాసనం ప్రశ్నించగా, ఆ ఖాళీలను తదుపరి నోటిఫికేషన్‌కు క్యారీ ఫార్వార్డ్ చేశామని, అయితే కొత్త నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు.
జిల్లాల మార్పుతో స్థానికత అంశం సంక్లిష్టంగా మారడం వల్ల దీనిపై సుదీర్ఘ వాదనలు వినాల్సిన అవసరం ఉందని. అందువల్ల తదుపరి తుది విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. అప్పటివరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా అమలులో ఉంటాయని, హైకోర్టులోని కోర్టు ధిక్కరణ పిటిషన్ చర్యలపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
