నాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయండి..హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ పిటిషన్

నాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయండి..హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ పిటిషన్

హైదరాబాద్‌, వెలుగు:  లైంగిక వేధింపుల ఆరోపణలతో తనపై అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ములగాని ఉదయ్‌కృష్ణారెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తోటి ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఈనెల 18న చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసు చట్టవిరుద్ధమని, ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే తనను నిందితుడిగా చేర్చారని పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.

ముస్సోరిలో శిక్షణ పొందుతున్న సమయంలో ఫిర్యాదుదారుతో పరస్పర అంగీకారంతో ప్రేమ సంబంధం ఏర్పడిందని, ఇద్దరం వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నామని పిటిషన్‌లో ఉదయ్​కృష్ణారెడ్డి తెలిపారు. తనకు మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానంతో ఫిర్యాదుదారు వేరే ఐఏఎస్‌ అధికారిని వివాహం చేసుకున్నారని, అనంతరం ఆ అనుమానం నిజం కాదని తెలుసుకుని మళ్లీ తనతో సంబంధం కొనసాగించాలని కోరుతూ సంప్రదించారని వివరించారు.

ఫిర్యాదుదారు మొదట అకాడమీ అధికారులకు ఫిర్యాదు చేసి, ఆ తర్వాత అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో మరో కాంప్లైంట్​ఇచ్చారని, ఈ రెండు ఫిర్యాదుల్లో చేసిన ఆరోపణలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయని పిటిషన్‌లో వివరించారు. అయినప్పటికీ పోలీసులు ఆ అంశాలను పరిశీలించకుండా, ఎలాంటి విచారణ జరపకుండా తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని ఆరోపించారు.

వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా క్రిమినల్‌ కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమని, ఈ కేసు కొనసాగితే తన సర్వీస్ లైఫ్ తో పాటు వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం వాటిల్లే అవకాశముందని పేర్కొంటూ అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని హైకోర్టును అభ్యర్థించారు.