ఎల్-నినోను ఎదుర్కొందాం..రైతులు, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి

 ఎల్-నినోను ఎదుర్కొందాం..రైతులు, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి
  • కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమావేశం
  • ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలే మేలు
  • ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్​రెడ్డి

ఆదిలాబాద్/నిజామాబాద్, వెలుగు: ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్​లో ఆదిలాబాద్, నిర్మల్, -ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎల్-నినో ప్రభావాన్ని వ్యవసాయ రంగానికే పరిమితం కాదని.. తాగునీరు, సాగునీరు, విద్యుత్, పశుసంవర్థక, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవనం, భూగర్భ జలాలు, ఇరిగేషన్ తదితర అన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. శాఖలన్నీ సమిష్టిగా నిలబడి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలన్నారు. ప్రతి గ్రామంలో రైతులకు వర్షాభావ పరిస్థితులు, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కందులు, పెసర్లు, నువ్వులు, వేరుశనగ, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. 

తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఎల్-నినో బుక్‌‌‌‌లెట్, తెలంగాణ జలసిరి పోస్టర్లను ప్రత్యేక అధికారి, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. సమావేశంలో కలెక్టర్లు రాజర్షి షా, భవేశ్​ మిశ్రా, హరిత, ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు బొజ్జు పటేల్, ఎమ్మెల్యే ప్రేమ్‌‌‌‌సాగర్ రావు,  ఐటీడీఏ పీవో మంద మకరందు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలి

ఎల్​నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేయటమే మేలని ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి.సుదర్శన్​ రెడ్డి అన్నారు. సోమవారం   నిజామాబాద్ ​కలెక్టరేట్​లో ఉమ్మడి జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రివ్యూ నిర్వహించారు. సుదర్శన్​రెడ్డి మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ నీటితో సాగు అయ్యే అయిల్​పామ్, కందులు, నువ్వులు, వేరుశనగ, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కాయగూరలు, పండ్ల తోటల పెంపకం చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సాగుపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, కౌలాస్​నాలా, పోచారం, సింగీతం, కళ్యాణి, రామడుగు, అలీసాగర్​ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలతోపాటు భూగర్భజలాలు, తాగునీటి సప్లయ్, ప్రత్యామ్నాయ పంటల సాగు, కరంట్ డిమాండ్​తదితర ఆంశాలపై చర్చించారు. ఎల్​నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న దృష్ట్యా  రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. 

ప్రత్యామ్నాయ కార్యచరణ చేపట్టాలి

ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా మాట్లాడుతూ..  ప్రకృతి వైపరీత్యాలను నిలువరించే శక్తి ఎవరికీ ఉండదని,  ముందస్తుగానే అప్రమత్తమై ప్రత్యామ్నాయ  కార్యచరణను చేపడితే చాలా వరకు విపత్తు ద్వారా చేకూరే నష్టం నుంచి బయటపడవచ్చన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​ కుమార్​ గౌడ్, స్టేట్ ​మైనార్టీ కమిషన్​చైర్మన్​ తారిక్ అన్సారీ, నిజామాబాద్, కామారెడ్డి  కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్​ సంగ్వాన్, పోలీస్ ​కమిషనర్​సాయి చైతన్య, ఎస్పీ రాజేశ్ చంద్ర, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్​పాల్​ సూర్యనారాయణ, పైడి రాకేశ్ ​రెడ్డి, తోట లక్ష్మీకాంతరావు, మేయర్ ఉమారాణి, ఆయా శాఖల అధికారులు, సైంటిస్టులు, ఆదర్శ రైతులు తదితరులు పాల్గొన్నారు.