చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉస్మాన్‌సాగర్(గండిపేట) జలాశయంలో వరుణ జపం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సి.ఎస్.రంగరాజన్, లక్ష్మీనరసింహన్ నేతృత్వంలో, వేద భవనానికి చెందిన ప్రముఖ వేద పండితుడు డాక్టర్ వి.శ్రీరామ ఘనాపాఠి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేద పండితులు నడుములోతు నీటిలో నిలబడి వరుణ జప మంత్రాలను 108 సార్లు పారాయణం చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
