ఆదివాసీ ఆత్మగౌరవం..అగ్నిసాక్షిగా పుట్టే అపురూప శిల్పం.. 4వేల సంవత్సరాల హస్తకళకు జీఐ ట్యాగ్

ఆదివాసీ ఆత్మగౌరవం..అగ్నిసాక్షిగా పుట్టే అపురూప శిల్పం.. 4వేల సంవత్సరాల హస్తకళకు జీఐ ట్యాగ్

దోక్రా లోహపు కళాఖండాల తయారీలో తెలంగాణలోని గిరిజన కళాకారులు ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆదిలాబాద్ మండలం చిట్టెల్ బోరి, జైనూర్ మండలం ఊషెగాం, జనగాం, కెరమెరి మండలం కేస్లా గూడ, తాంసి మండలంలోని బెల్సారి రాంపూర్ గిరిజన గ్రామాల్లో 150 మంది గిరిజన దోక్రా కళాకారులు నేటికీ ఇత్తడి కళాఖండాలను తయారు చేస్తున్నారు. 

దోక్రా.. నాలుగువేల సంవత్సరాలకు పైగా ప్రాచీనమైన లోహ హస్తకళ. సింధూలోయ నాగరికతకు చెందిన ప్రసిద్ధ ‘నాట్యగత్తె’ విగ్రహం కూడా ఈ కళకు చెందినదే. గిరిజన దేవతల విగ్రహాలు, నాగోబా విగ్రహాలు, జంతువుల ఆకారాలు, అలంకరణ వస్తువులు, వివిధ వ్యవసాయ పరికరాలు, విత్తనాలు చల్లే జడ్గా హోల్డర్, జంతువుల మెడలో కట్టే గంటలను ఇత్తడిని కరిగించి తయారు చేస్తున్నారు. అత్యంత పురాతనమైన ఈ కళాఖండాలకు జీఐ ట్యాగ్ కూడా వచ్చింది. పురాతన దోక్రా కళ అంతరించిపోకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని దోక్రా కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధి ఎం. ఏ నజీర్ చెప్పారు.

రూపుమారిన కళాఖండాల డిజైన్లు

మారుతున్న కాలంతోపాటు గిరిజన కళాకారులు తయారుచేస్తున్న దోక్రా లోహపు కళాఖండాల రూపురేఖలు మారాయి. ఆధునిక గృహాలంకరణ, ఫర్నిచర్, లైటింగ్ ల్యాంప్‌‌‌‌లు, సమకాలీన ఇళ్లకు సరిపోయేలా ఎలక్ట్రిక్ టేబుల్ ల్యాంప్‌‌లు, వినూత్నమైన కాండిల్ హోల్డర్లు, షాన్‌‌డిలియర్లు దోక్రా శైలిలో రూపొందుతున్నాయి. దీనివల్ల నగరాల్లోనూ తమ కళాఖండాలకు డిమాండ్ పెరిగిందని కేస్లాగూడకు చెందిన దోక్రా కళాకారుడు మడావి బాపురావు చెప్పారు.

రాజసం ఉట్టిపడేలా కళాఖండాలు

ఆధునిక ఇంటి తలుపులకు రాజసం ఉట్టిపడేలా చేపలు, నెమళ్లు, గుర్రాలు,రేఖాగణిత రూపాలతో కూడిన హ్యాండిల్స్ విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి. కార్యాలయాల్లో వాడేందుకు వీలుగా కార్పొరేట్ బహుమతులు పెన్ హోల్డర్లు, విజిటింగ్ కార్డ్ స్టాండ్‌‌లు, ఆకర్షణీయమైన బుక్‌‌మార్క్‌‌లు తయారు చేస్తున్నారు. లోహంతోనే కాకుండా ప్రీమియం షీషమ్ లేదా టేకు కలపతో చేసిన స్టాండ్‌‌లపై దోక్రా మానవ విగ్రహాలను అమర్చి అందమైన వస్తువులుగా మారుస్తున్నారు.

 సహజమైన నదీ తీర రాళ్లు, స్ఫటికాలను బేస్‌‌గా ఉంచి వాటిపై లోహపు తీగలతో దోక్రా డిజైన్లను అద్భుతంగా మలుస్తున్నారు. రాతిపై కూర్చున్న తాబేలు లేదా జింక, గోండ్ పెయింటింగ్ ఫ్రేమ్స్, టెర్రకోట లేదా కాన్వాస్ బోర్డులపై సాంప్రదాయ వార్లీ లేదా గోండ్ చిత్రాలను గీసి, వాటి మధ్యలో లోహపు దోక్రా విగ్రహాలను అమర్చి ఆధునిక వాల్ హ్యాంగింగ్స్ తయారు చేస్తున్నారు. వీరు స్థానిక దేవతలైన జంగూభాయ్, భీమ్‌‌దేవ్, పెర్సా పెన్ విగ్రహాలను కూడా తయారు చేస్తారు.

ఇత్తడి ఫ్యాషన్ జ్యువెలరీ

ఫ్యాషన్, లైఫ్‌‌స్టైల్  జ్యువెలరీ నేటి తరం యూత్​ను ఆకట్టుకునేలా బోహో-చీక్ శైలిలో పెద్ద పెండెంట్లు, చోకర్లు, ఇంటీరియర్ డిజైన్ ఉన్న గాజులు, చెవి రింగులను లైట్-వెయిట్ లోహంతో సృష్టిస్తున్నారు. చీరల అంచులు, కుర్తీలు, హ్యాండ్‌‌ బ్యాగ్​లపై దోక్రా చిన్న ముక్కలను, బటన్లుగా వాడుతున్నారు. 

కళాకారులు ఇప్పుడు కొత్తగా ప్రకృతిలో లభించే చెట్ల బెరళ్లు, ఆకులు, సహజ వస్తువులపై నేరుగా కాస్టింగ్ చేసే ‘ఆర్గానిక్ డోక్రా’ విధానాన్ని అవలంబిస్తున్నారు. దీనివల్ల వస్తువులపై ప్రకృతిసిద్ధమైన డిజైన్లు ఏర్పడుతున్నాయి. ఈ కొత్త డిజైన్లతో తయారుచేసిన కళాఖండాలను తాము ఢిల్లీలోని ప్రగతి మైదాన్​లో, హైదరాబాద్ నగరంలోని శిల్పారామంలో విక్రయిస్తున్నామని దోక్రా కళాకారుడు మడావి మారుతి చెప్పారు. లోహంతో పోతపోసిన విగ్రహాలు వాటి బరువు ఆధారంగా విక్రయిస్తున్నారు. వీటి ధర కిలోగ్రాముకు రూ.1300 ఉంది. 

తయారీ ఇలా..

దోక్రా కళాఖండాలను లాస్ట్-వాక్స్ టెక్నిక్​ను ఉపయోగిస్తారు. ముందుగా నల్లమట్టి, వరి పొట్టు లేదా జనపనార ముక్కలు కలిపి విగ్రహం నమూనాను తయారు చేసి, ఎండబెడతారు. మైనపు పూత లేదా తేనెటీగల మైనం, ఆవనూనె, ఒక రకమైన చెట్టు జిగురును కలిపి మరిగించి మైనపు మిశ్రమాన్ని తయారుచేస్తారు. ఈ మైనాన్ని సన్నని తీగలుగా లేదా రేకులుగా మారుస్తారు. 

ఎండిన మట్టి నమూనాపై ఈ మైనపు తీగలను చుట్టి, దానిపై కావలసిన జూలు, ముఖ కవళికలు, అలంకరణ డిజైన్లను అల్లుతారు. బాహ్య మట్టి అచ్చు మైనపు నమూనా సిద్ధమయ్యాక, దానిపై నది ఒడ్డున లభించే సన్నని మట్టి, ఆవు పేడ మిశ్రమాన్ని ఒక పొరగా పూస్తారు. ఇది లోపలి మైనపు డిజైన్‌‌ను ఏమాత్రం చెడగొట్టకుండా జాగ్రత్తగా చేస్తారు. దీనిపై మళ్లీ దట్టమైన నల్లమట్టి పొరను పూసి గట్టి అచ్చుగా మారుస్తారు. ఈ అచ్చు పైభాగంలో లేదా కింది భాగంలో కరిగిన లోహం పోయడానికి ఒక చిన్న రంధ్రం ఏర్పాటుచేస్తారు. 

మైనాన్ని కరిగించి, మట్టి అచ్చును ఒక ప్రత్యేకమైన బట్టీలో వేడిచేస్తారు. వేడికి లోపల ఉన్న మైనం పూర్తిగా కరిగి, రంధ్రం ద్వారా బయటకు వచ్చేస్తుంది. అందుకే దీనిని లాస్ట్-వాక్స్ టెక్నిక్ అంటారు. ఇప్పుడు అచ్చు లోపల మైనం ఉన్న చోట ఒక ఖాళీ అచ్చు ఏర్పడుతుంది. ఇత్తడి, కంచు లేదా బెల్ మెటల్ ముక్కలను ఒక మట్టి పాత్రలో వేసి అధిక ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో కరిగించి, మట్టి అచ్చు రంధ్రంలోకి పోస్తారు. లోహం లోపలి ఖాళీ ప్రదేశాన్నిపూర్తిగా ఆక్రమిస్తుంది. 

లోహం పూర్తిగా చల్లారిన తర్వాత, పైన ఉన్న మట్టి అచ్చును సుత్తితో కొట్టి జాగ్రత్తగా పగలగొడతారు. లోపల ఘనీభవించిన లోహపు విగ్రహం బయటకు వస్తుంది. చివరగా దానిపై ఉన్న అదనపు లోహపు ముక్కలను కత్తిరించి, వైర్ బ్రష్‌‌లతో శుభ్రం చేసి, మెరుగులు దిద్దుతారు. 

ప్రతి దోక్రా కళాఖండం ప్రపంచంలో ఒకే ఒక్కటిగా మిగిలిపోతుంది. దేశంలో ఈ దోక్రా కళ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాతోపాటు ఎక్కువగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బంకురా జిల్లాలోని బికాన్నా, దరియాపూర్, ఒడిశా, ఛత్తీస్‌‌గఢ్ బస్తర్ ప్రాంతాల్లో గిరిజన కళాకారుల ద్వారా జీవించి ఉంది.

అంతర్జాతీయ గుర్తింపు

దోక్రా లోహ కళ నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం ఉషేగావ్ గ్రామానికి చెందిన ‘ఓఝా’ అనే గిరిజన హస్తకళాకారులు దీనిని తయారు చేస్తున్నారు. వీరు ఎటువంటి ఆధునిక యంత్రాలు లేకుండా కేవలం చేతి నైపుణ్యంతో ఇత్తడి వస్తువులను, దేవుని విగ్రహాలను, గృహాలంకరణ వస్తువులను అత్యంత అద్భుతంగా సృష్టిస్తున్నారు. 

జీఐ ట్యాగ్ చట్టపరమైన రక్షణ వల్ల ఇతర ప్రాంతాలవారు ‘దోక్రా’ పేరుతో నకిలీ వస్తువులను మార్కెట్లోకి తేకుండా నిరోధించొచ్చు. స్థానిక గిరిజన కళాకారుల నైపుణ్యానికి అంతర్జాతీయ మార్కెట్‌‌లో మంచి ఆదరణ, సరైన ధర లభిస్తుంది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్‌‌ను లోహపు అచ్చు కేంద్రంగా గుర్తించింది. 

కళాకారుల ముందున్న సవాళ్లు

గతంలో కిలో 300 రూపాయలున్న ఇత్తడి ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇత్తడి ధరలు పెరగడంతో తాము తయారు చేస్తున్న కళాఖండాలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఊషగాంకు చెందిన దోక్రా కళాకారుడు మడావి తులసీరాం చెప్పారు. నైపుణ్యం కల యువత ఇతర ఉపాధుల వైపు వెళ్లడం, మార్కెటింగ్ లోపం, మధ్యవర్తుల ఆధిపత్యం, ఎగుమతులకు తగిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని ఆయన చెప్పారు. 

ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పాత ఇత్తడి బిందెలు, బకెట్లను కొని వాటిని కరిగించి కళాఖండాలు తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. ధర పెరగడం వల్ల తాము తయారుచేసిన వస్తువులకు మార్కెట్​లో తక్కువ ధరకు అడుగుతున్నారని మడావి తులసీరాం ఆవేదన వ్యక్తం చేశారు. దోక్రా కళను మా కుటుంబం మూడు తరాలుగా కొనసాగిస్తోందని, కానీ ఇటీవల ఆర్డర్లు లేక, బ్యాంకులు, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక కళాఖండాల తయారీ కుంటుపడిందని జంగావ్​కు చెందిన దోక్రా కళాకారుడు మడావి మారుతి చెప్పారు. 

ఒక కళాఖండం తయారవడానికి ఒక రోజు సమయం పడుతుందని, కానీ దీనిపై మాకు తక్కువ ఆదాయం వస్తుందని, కూలీ కూడా దక్కడం లేదన్నారు. తాను జంగుబాయి సొసైటీని ఏర్పాటు చేసి దోక్రా కళాఖండాలను తయారు చేస్తున్నామని చెప్పారు.దోక్రా కళ కేవలం లోహంతో చేసిన శిల్పం కాదు. అది గిరిజనుల చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, ప్రకృతితో వారి అనుబంధాన్ని తరతరాలకు అందిస్తున్న వారసత్వం. 

గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ 

దోక్రా కళాకారుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి, వారు తయారు చేస్తున్న కళాఖండాలను గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలంగాణ హస్తకళల సంస్థ అధికారి ఎం.ఏ నజీర్ చెప్పారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో కళాకారులకు 50 శాతం సబ్సిడీపై రుణాలు ఇప్పించి కళాకారులను ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు.