కోల్‌బెల్ట్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చెన్నూరులో 100 పడకల ఆస్పత్రిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరులో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి పనులను ఆదివారం కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి పరిశీలించారు.
నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని, పట్టణంలోని పీహెచ్‌సీని ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం పలు ప్రభుత్వ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, విద్యాబోధన, పారిశుధ్యం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి
అంతకుముందు మార్నింగ్ వాక్‌లో భాగంగా పలు బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన 13వ వార్డు దుబ్బాగూడెంకు చెందిన ముంతాజ్‌బేగం, బుజ్జ పురుషోత్తం, కడవంచి ప్రకాశ్, 7వ వార్డు శ్రీనగర్ కాలనీకి చెందిన వంగల చుక్కమ్మ కుటుంబాలను మంత్రి పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మున్సిపల్‌చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్పర్సన్ వినయ్, చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్తివారీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
