లోన్ తీసుకుని EMIలో బైక్, కారు కొంటున్నారా..? మరి ఈ గుడ్‌న్యూస్ మీకు తెలుసా..?

లోన్ తీసుకుని EMIలో బైక్, కారు కొంటున్నారా..? మరి ఈ గుడ్‌న్యూస్ మీకు తెలుసా..?

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. కారు లేదా బైక్ లోన్ తీర్చుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నుంచి 'హైపోథెకేషన్' తొలగించుకోవడానికి ఇకపై ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మార్చి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆన్‌లైన్ విధానం ద్వారా ఈ ప్రక్రియ అంతా ఆటోమేటిక్‌గా దానంతట అదే జరిగిపోతుంది.

పాత కష్టాలకు చెక్..
ఈ విధానం రాక ముందు వరకూ వాహనం లోన్ పూర్తయ్యాక, బ్యాంక్ నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకుని.. మళ్లీ ఆర్టీవో ఆఫీసులో ఫైల్ సబ్మిట్ చేసి, వారాల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ క్రమంలో దళారులు, పేపర్ వర్క్ సామాన్యులకు చుక్కలు చూపించేవి. కానీ కేంద్ర రవాణా శాఖ తీసుకొచ్చిన ఈ సంస్కరణతో మనుషుల ప్రమేయం లేకుండానే పనులు పూర్తవుతాయి.

సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త విధానం ఆర్‌బీఐకి చెందిన యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ద్వారా పనిచేస్తుంది. బ్యాంకులు, యూఎల్ఐ, ప్రభుత్వ 'వాహన్' పోర్టల్ మధ్య రియల్ టైమ్ డేటా ఎక్స్ఛేంజ్ జరుగుతుంది. మీరు లోన్ ఆఖరి రూపాయి కట్టగానే.. బ్యాంక్ నేరుగా సిస్టమ్‌లో సమాచారాన్ని అప్‌డేట్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్ పూర్తయి, మీ ఆర్‌సీ నుంచి హైపోథెకేషన్ తొలగించబడుతుంది. ప్రక్రియ పూర్తయినట్లు మీ మొబైల్‌కు వెంటనే ఎస్‌ఎమ్ఎస్ కూడా వస్తుంది.

ప్రస్తుత బ్యాంకులు ఇవే..
తొలి దశలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు చోళమండలం, శ్రీరామ్ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్ వంటి ఐదు ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీలను ఈ సిస్టమ్‌లో చేర్చారు. రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈ ఆన్‌లైన్ గొడుగు కిందకు రానున్నాయి.

ప్రజలకు కలిగే ప్రయోజనాలు..
ఈ డిజిటల్ క్లియరెన్స్ విధానం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, పారదర్శకత పెరుగుతుంది. వాహనదారులు తమ లోన్ క్లియర్ అయిన వెంటనే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగకుండానే 'క్లీన్ ఆర్‌సీ'ని పొందవచ్చు. ప్రభుత్వ 'ఈజ్ ఆఫ్ లివింగ్' చొరవలో భాగంగా చేపట్టిన ఈ నిర్ణయంపై వాహనదారులు ప్రస్తుతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.