2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ ఇవ్వాలి..సీఎస్‌‌కు ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి విజ్ఞప్తి 

2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ ఇవ్వాలి..సీఎస్‌‌కు ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి విజ్ఞప్తి 
  • విద్యా కమిషన్ నివేదికను నిలిపివేయాలి
  • సీఎస్‌‌కు ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీచర్ల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీచర్ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం వారు టీపీయూఎస్ యూనియన్ నేతలతో కలిసి సెక్రటేరియెట్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు.

2003 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వర్తింపజేయాలని కోరారు.రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌‌లో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది బోధనా సిబ్బందిని విద్యాశాఖలో విలీనం చేయాలని, వారికి '010 పద్దు' ద్వారా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల సిబ్బందికి నగదు రహిత ఆరోగ్య పథకం అమలు చేయాలన్నారు.

వివాదాస్పద జీవో 317 వల్ల వేల సంఖ్యలో ఉపాధ్యాయులు తమ స్థానికతను కోల్పోయారని, దీనిని వెంటనే సవరించి 3,200 మంది టీచర్లకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జీవో 190, జీవో 25ల అమలులో ఎదురవుతున్న సమస్యలను తొలగించాలన్నారు. కాగా..తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదికపై ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్టేక్ హోల్డర్ల (బాధిత వర్గాల) అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలతో పాటు టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.