FIFA VAR Controversy: ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ మ్యాచ్‌లలో పరాగ్వే చేతిలో జర్మనీ జట్టు షాకింగ్ ఓటమిని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ, ఎక్స్‌ట్రా టైమ్‌లో జర్మనీ చేసిన గోల్‌ను VAR (వీడియో అసిస్టెంట్ రెఫరీ) డిస్అలోవ్ (రద్దు) చేయడం ఫుట్‌బాల్ ప్రపంచంలో పెద్ద దుమారమే లేపింది. ఈ వివాదాస్పద నిర్ణయంపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) ఎట్టకేలకు స్పందించింది.
101వ నిమిషంలో హై డ్రామా:
మ్యాచ్ 1-1తో టై కావడంతో ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. ఎక్స్‌ట్రా టైమ్ 101వ నిమిషంలో జర్మనీ డిఫెండర్ జోనాథన్ తహా అద్భుతమైన గోల్ చేసి జర్మనీని గెలిపించినంత పని చేశాడు. దీంతో జర్మనీ ప్లేయర్స్, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ పరాగ్వే గోల్‌కీపర్ ఓర్లాండో గిల్‌పై ఫౌల్ జరిగిందని VAR రివ్యూలో తేలడంతో రెఫరీ ఆ గోల్‌ను రద్దు చేశారు. జర్మనీ ఆటగాడు వాల్డెమార్ ఆంటోన్.. గోల్‌కీపర్ గిల్‌ను కిందకి నెట్టేయడంతో ఈ ఫౌల్ ఇచ్చారు. కానీ ఆ కాంటాక్ట్ చాలా స్వల్పంగా (Minimal) ఉండటంతో జర్మనీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లగా, అక్కడ జర్మనీ ఓడిపోయి టోర్నీ నుంచి ఇంటిదారి పట్టింది.
రెఫరీ నిర్ణయాన్ని సమర్థించిన ఫిఫా:
ఈ వివాదంపై ఫిఫా రెఫరీల చీఫ్ పియర్లూయిగి కొలినా మాట్లాడుతూ.. బంతిని ఆడే ఉద్దేశం లేకుండా, కావాలనే ప్రత్యర్థి ఆటగాళ్లను లేదా గోల్‌కీపర్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించే అటాకర్లను శిక్షించాలని అధికారులకు ముందే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఒక అటాకింగ్ ప్లేయర్ బంతిపై ఆసక్తి చూపకుండా, ప్రత్యర్థి కదలికలను అడ్డుకోవాలనే స్పష్టమైన ఉద్దేశంతో స్వల్పంగా కదిలినా.. అది ఫౌల్ కిందకే వస్తుంది. ముఖ్యంగా ప్రత్యర్థి గోల్‌కీపర్ గోల్‌ను రక్షించకుండా అడ్డుకునే ఇలాంటి వ్యూహాలపై రెఫరీలు, అవసరమైతే VAR కచ్చితంగా జోక్యం చేసుకుంటాయి. ఈ రూల్స్ గురించి కోచ్‌లు, ఆటగాళ్లకు ముందే సమాచారం ఇచ్చామని కొలినా స్పష్టం చేశారు.
ALSO READ : రౌండ్ ఆఫ్ 16 చేరిన మెక్సికో.. 40 ఏళ్ల తర్వాత అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్ వైరల్!
మమ్మల్ని మోసం చేశారు:
ఫిఫా వివరణ ఇచ్చినప్పటికీ జర్మనీ లెజెండ్ థామస్ ముల్లర్ మాత్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు VAR ఏం చూస్తుందో నాకు అర్థం కావడం లేదు.. గోల్‌కీపర్ నిజంగా అదృష్టవంతుడు.. జర్మనీ వంద శాతం సరైన గోల్ కొట్టింది. ఇంతకంటే పెద్ద దాడులను టోర్నీ అంతటా అనుమతించారు. జర్మన్లమైన మేము మోసపోయామని ఫీలవుతున్నాం.. ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అతిపెద్ద వేదికపై జరిగిన పగటి దొంగతనం ఇది.. ఎక్కడో వందల మీటర్ల దూరంలో గదిలో కూర్చున్న వ్యక్తి, ఒక ఆటగాడి జీవితకాల శ్రమను ఒకే ఒక్క నిర్ణయంతో తుడిచేయడం మైదానంలో ఉన్న ప్రతి ఆటగాడి గుండెను ముక్కలు చేస్తుందని జోనాథన్ తహాపై ముల్లర్ సానుభూతి వ్యక్తం చేశారు.
