రౌండ్ ఆఫ్ 16 చేరిన మెక్సికో.. 40 ఏళ్ల తర్వాత అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్ వైరల్!

రౌండ్ ఆఫ్ 16 చేరిన మెక్సికో.. 40 ఏళ్ల తర్వాత అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్ వైరల్!

Mexico Fans Celebration: ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఈక్వెడార్‌పై 2-0 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించి, రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించడంతో మెక్సికో దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. భారీ వర్షం, మెరుపుల కారణంగా గంట ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో సహ-ఆతిథ్య మెక్సికో జట్టు అటు దూకుడైన ఆటతీరుతో, ఇటు పటిష్టమైన డిఫెన్స్‌తో అద్భుత విజయాన్ని అందుకుంది.

40 ఏళ్ల తర్వాత తొలి నాకౌట్ విక్టరీ: 
ఫిఫా ప్రపంచకప్‌ నాకౌట్ స్టేజ్‌లలో మెక్సికో జట్టుకు ఉన్న ఒక పెద్ద శాపం ఈ గెలుపుతో తొలగిపోయింది. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత (1986 తర్వాత) ప్రపంచకప్‌లో మెక్సికో సాధించిన మొట్టమొదటి నాకౌట్ విజయం ఇదే కావడం విశేషం. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో వరుసగా 8 సార్లు ఎలిమినేట్ అయి అత్యంత ఘోరమైన రికార్డును కలిగి ఉన్న మెక్సికో.. ఈ గెలుపుతో ఆ రికార్డుకు బ్రేక్ వేసింది. అలాగే ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టుకు ఇది కేవలం రెండో నాకౌట్ విజయం మాత్రమే. ఈ చారిత్రాత్మక గెలుపు తర్వాత మెక్సికో సిటీ వీధుల్లో ఫ్యాన్స్ జరుపుకున్న సంబరాల వీడియోను ఫిఫా (FIFA) తన ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేస్తూ.. దీనిని ఒక చారిత్రాత్మక రాత్రిగా అభివర్ణించింది.

ఫస్ట్ హాఫ్‌లోనే దెబ్బకొట్టిన ఎల్ ట్రి: 
మ్యాచ్ ప్రారంభం నుంచే మెక్సికో తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫస్ట్ హాఫ్‌లోనే ఈక్వెడార్ చేసిన ఒక డిఫెన్స్ లోపాన్ని (Defensive Mistake) అనుకూలంగా మార్చుకున్న జూలియన్ క్వినోనెస్ మెక్సికోకు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వెటరన్ స్టార్ రౌల్ జిమెనెజ్ రెండో గోల్ కొట్టడంతో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికే మెక్సికో 3–0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక సెకండ్ హాఫ్‌లో ఈక్వెడార్ జట్టు ఎక్కువ సమయం బంతిని తన ఆధీనంలో ఉంచుకుని కమ్‌బ్యాక్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, మెక్సికో డిఫెన్స్ మాత్రం లొంగలేదు.. మ్యాచ్ ఇంజూరీ టైమ్‌లో ఈక్వెడార్ డిఫెండర్ పియరో హింకాపీ రెడ్ కార్డ్ తో మైదానాన్ని వీడటంతో కథ ముగిసింది.  

ALSO READ : హీటెక్కిన గోల్డెన్ బూట్ రేస్.. మెస్సీ, ఎంబాప్పే, హాలాండ్ మధ్య హోరాహోరీ ఫైట్

నెక్స్ట్ టార్గెట్ ఇంగ్లాండ్ లేదా కాంగో:
కోచ్ జేవియర్ అగుయిరే ఆధ్వర్యంలోని మెక్సికో జట్టు ఈ టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేయడమే కాకుండా.. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా (Clean Sheet) అడ్డుకుంది. ప్రస్తుత వరల్డ్ కప్‌లోనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా మెక్సికో అవతరించింది. కాగా సొంత గడ్డపై తమ తదుపరి రౌండ్ ఆఫ్ 16 పోరులో మెక్సికో జట్టు.. ఇంగ్లాండ్ లేదా డీఆర్ కాంగో (DR Congo) మ్యాచ్ విజేతతో తలపడనుంది.