పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను కర్రతో కొట్టి చంపేసింది భార్య. బుధవారం ( జులై 1 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. భర్త శ్రీనివాస్ ను కర్రతో కొట్టి చంపేసింది భార్య పుష్పలత. అప్పన్నపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్, పుష్పలత దంపతులు గత కొంతకాలంగా హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్నారు.
భార్య ఓ ప్రైవేట్ స్కూల్ లో పని చేస్తుండగా... శ్రీనివాస్ జులాయిగా తిరుగుతూ మద్యానికి డబ్బుల కోసం భార్యను వేధిస్తూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో నిత్యం భార్య పిల్లలను వేధించేవాడని... దీంతో విసిగి వేసారిన భార్య అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న భర్తను కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
