కర్ణాటకలో దారుణం జరిగింది. తనకంటే లావుగా ఉందని... పిల్లలు పుట్టడం లేదని భార్యను గొంతు నులిమి చంపేశాడు భర్త. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో, నెలల తరబడి వరకట్నం వేధింపులు, బాడీ షేమింగ్, గృహహింస తర్వాత 29 ఏళ్ల స్టాఫ్ నర్సును ఆమె భర్త గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు ఆమెను 'చాలా లావుగా ఉన్నావు' అని పదేపదే అవమానించాడని, ఆమెకు పిల్లలు పుట్టరని వేధిస్తూ ఉండేవాడని దర్యాప్తులో తేలిందని అంటున్నారు పోలీసులు.
ప్రియాంక కమలాకర్, బసవరాజ్ వద్దర్ లకు 2024 డిసెంబర్ లో వివాహం జరిగింది. పెళ్ళైన కొన్ని వారాల్లోనే బసవరాజ్ ప్రియాంకను వేధించడం స్టార్ట్ చేశాడని అంటున్నారు బంధువులు. బసవరాజ్, అతని కుటుంబ సభ్యులైన రేణవ్వ, సుభాష్, సిద్దరమేష్ లతో కలిసి, ప్రియాంకను ఆమె పుట్టింటి నుండి డబ్బు, బంగారం తీసుకురమ్మని పదేపదే ఒత్తిడి చేశారని.. ఆమె రూపం, బరువు విషయంలో కూడా నిత్యం అవమానాలకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు మృతురాలి బంధువులు.
►ALSO READ | ఇది కదా ట్విస్ట్ అంటే.. రిటైర్మెంట్ రోజే ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్.. ఇంతకీ కేసు ఏంటంటే..
నవల్గుండ్ తాలూకాలోని హనసి గ్రామంలోని ఇంట్లో సోమవారం రాత్రి బసవరాజ్ ప్రియాంకను గొంతు నులిమి చంపేశాడని తెలిపారు పోలీసులు. బసవరాజ్ తనను వేధిస్తున్నాడని ప్రియాంక తమకు తరచూ చెప్పేదని అంటున్నారు కుటుంబసభ్యులు. పెళ్ళి తర్వాత ప్రియాంక రెండుసార్లు గర్భం దాల్చినప్పటికీ, భర్త పదేపదే శారీరకంగా హింసించడం వల్ల గర్భస్రావాలకు గురైందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
పోలీసులు నవల్గుండ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, బసవరాజ్ వద్దర్‌తో పాటు రేనవ్వ, సుభాష్, సిద్దరమేష్‌లను అరెస్టు చేశారు. వారిపై హత్య, వరకట్నం వేధింపులు, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. బసవరాజ్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ప్రియాంక కుటుంబసభ్యులు బంధువులు.
