పిల్లాడు ఎంత విలవిలలాడాడో పాపం.. హోలీ రంగు గుప్పినందుకు నానమ్మ చేసిన పనికి..

పిల్లాడు  ఎంత విలవిలలాడాడో పాపం.. హోలీ రంగు గుప్పినందుకు నానమ్మ చేసిన పనికి..

హోలీ పండుగ అంటే సరదా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. వరుసను పక్కన పెట్టి రంగులు గుప్పుకోవడం.. ఆనందంలో మునిగి  తేలడం ఈ పండుగ స్పెషల్. చిన్న పిల్లలైతే మరీనూ.. పండుగను ఒకటి రెండు రోజులు ముందుగానే స్టార్ట్ చేసి.. ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఈ పిల్లోడు హోలీ ఆడుతూ నానమ్మ పైన రంగు నీళ్లు గుప్పాడు అంతే.. ఆమె ఎంత పని చేసిందో చూస్తే ప్రాణం తరుక్కుపోవడం ఖాయం. అసలు మనసనేది ఉందా ఈమెకు అనుకునేలా ఆమె చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది .

మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగిన ఈ ఘటన ప్రతి మనిషికి గుండె చివుక్కుమనేలా చేస్తుంది. సింధు థాకరే అనే మహిళ బకెట్ లో వేడి నీళ్లు మోసుకెళ్తుండగా ఆడుతూ వచ్చిన నాలుగేళ్ల బుడతడు ఆమెపై రంగులు చల్లాడు. వాటర్ కలర్ గన్ తో రంగు నీళ్లు గుప్పడంతో చిరాకుతో ఏకంగా బకెట్లో ఉన్న వేడినీళ్లు ఆ పిల్లాడిపైన పోసేసింది. 

చిన్న పిల్లోడు.. సరదాగా ఆడుకుంటున్నాడు.. అది కూడా హోలీ పండుగ కాబట్టి.. ఎంజాయ్ చేస్తున్నాడు. వీలైతే మనం కూడా వాడితో ఆడుకుందా.. లేదంటే వాడిని ఆడుకోనిద్దాం.. అనే కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించింది ఆమె. సలా సలా కాగుతున్న నీళ్లు పోసే సరికి.. కలర్ గన్ పడేసి పిల్లోడు విలవిల లాడిపోయాడు. పొగలు కక్కుతున్న వేడి నీళ్లు మీదపడే సరికి ప్రాణం పోయినంత పనయ్యిందో ఏమో పాపం.. నీటిలో నించి ఒడ్డున పడేసిన చేపపిల్లలా గిలగిలా కొట్టుకున్నాడు. 

ఆమె అంతటితో ఆగకుండా ఆ వెంటనే మరో బకెట్లో ఉన్న చల్లనీళ్లు పోసింది. బాబుకు ఉపశమనం ఉంటుందనుకుందో ఏమో.. కానీ వేడి నీళ్లు పోసిన వెంటనే చన్నీళ్లు పోయడం చాలా డేంజర్ అన్న సంగతి తెలిసినట్లు లేదు. అసహనంతో చేసిన పనికి.. తప్పును కప్పిపుచ్చుకునేందుకు చన్నీళ్లు పోసి బాబును మరింత డేంజర్ లో పడేసింది. 

వేడి నీళ్లు పోయడంతో బాబు బాడీ చాలా వరకు కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే చన్నీళ్లు పోయడంతో శరీరం అంతా బొబ్బలు కట్టినట్లు చెప్పారు. బాబును వెంటనే ఆస్పత్రిలో చేర్పించారని.. ఆమెపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. సీసీటీవీ లో రికార్డ్ అయిన ఈ వీడియో చూసిన వాళ్లు ఈమెకు కనీస జాలీ, దయ, మానవత్వం లేదు అన్నట్లుగా కామెంట్స్ పెడుతున్నారు. అవే నీళ్లీ ఆమెపై పోస్తే తెలిసేది అని దుమ్మెత్తి పోస్తున్నారు. మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.