- ఫారెస్ట్ లో 22 రకాల పండ్ల చెట్ల పెంపకానికి ప్లాన్
- మెదక్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు
- సక్సెస్ అయితే రాష్ట్ర మంతటా విస్తరించే ప్రణాళిక
మెదక్, శివ్వంపేట, వెలుగు: అడవిలో ఆహారం దొరకక కోతులు గ్రామాలు, పట్టణాల బాటపట్టాయి. దీంతో ఊళ్లలో ఎక్కడచూసినా కోతుల బెడద ఎక్కువైంది. మెదక్ జిల్లాలో కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు అధికారులు సంకల్పించారు. అడవిలో కోతులకు ఆహారం దొరికితే మళ్లీ అక్కడికే వాటిని పంపించొచ్చని భావిస్తున్నారు. ఈక్రమంలో గ్రామాలు, పట్టణాల్లో కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు ‘వున్ హ్యాండ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది.
కోతుల బెడద ఎక్కువగా ఉన్న మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ వద్ద ప్రయోగాత్మకంగా కోతుల ఆహార సేకరణ కేంద్రం ఏర్పాటు చేసింది. కోతులకు పండ్లు, ఇతర ఆహార పదార్థాలు వేయాలనుకునే వారు వాటిని ఈ కేంద్రంలో అందజేయాలి. అలా ఇచ్చేవారి పేర్లను రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ప్రజల నుంచి సేకరించే ఆహార పదార్థాలను అడవిలో వేసి రోడ్డు మీదకు వచ్చే కోతులు అక్కడికి వెళ్లేలా చూస్తున్నారు.
ఊళ్లలో కిష్కిందకాండ
వందల సంఖ్యలో కోతులు గుంపులు, గుంపులుగా వచ్చి జన జీవనానికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇళ్లలో జొరబడి వండిన అన్నం, నిత్యావసర సరుకులు ఎత్తుకెళ్తున్నాయి. కిరాణా షాపుల్లో సైతం ప్రవేశించి తినుబండారాలు, ఇతర సరుకులను ఎత్తుకెళ్తున్నాయి. కూరగాయలు, పండ్లు దారివెంట తీసుకెళ్తుంటే చేతుల్లోంచి లాక్కుంటున్నాయి. అవసరమైతే దాడులు కూడా చేస్తున్నాయి. పలుచోట్ల రోడ్ల మీదకు గుంపులుగా వస్తూ వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
22 రకాల పండ్ల చెట్లు పెంచి...
కోతులకు అడవిలో ఆహారం దొరకక రోడ్లు, జనావాసాల బాట పడుతున్నాయని, వాటికి ఆహారం లభించక వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు సైతం నాశనం చేస్తున్నాయని ఫౌండేషన్ ప్రతినిధులు గుర్తించారు. కోతులు అడవి దాటి బయటకు రాకుండా ఉండేందుకు ఫౌండేషన్ ద్వారా అడవిలో ఖాళీ ప్రాంతాల్లో 125 నుంచి 150 ఎకరాల విస్తీర్ణంలో 22 రకాల పండ్ల చెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. సోలార్ బోర్ వేల్స్ ఏర్పాటు చేసి సాసర్ పిట్లు ఏర్పాటు చేసి, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు.
సక్సెస్ అయితే రాష్ట్రమంతటా
కోతుల సమస్య నివారణకు ప్రయోగాత్మకంగా మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ వద్ద ఆహార సేకరణ కేంద్రం ఏర్పాటు చేయడంతోపాటు, పండ్ల మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే రాష్ట్రమంతా చేపట్టాలని ఫౌండేషన్‌తోపాటు ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు కోతులకు కుటుంబ నియంత్రణకు చర్యలు తీసుకోనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.
కోతులు బయటకు రాకుండా ఉండేందుకు
రోడ్లపైన ఆహారాలు వేస్తుండడంతో కోతులు గుంపులుగా రోడ్లపైకి చేరుతున్నాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడడంతో పాటు ప్రమాదాల్లో కోతులు చనిపోతున్నాయి. దీనిని అరికట్టేందుకు మేము ఆహరణ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కోతులకు పండ్లు, ఆహారం ఇవ్వాలనుకునే వారు మేము ఏర్పాటు చేసిన స్టాల్స్ లో అందజేయాలి. ఇప్పటికే కొన్ని పండ్ల మొక్కలు అడవిలో నాటాం. మరికొన్ని కూడా త్వరలో నాటుతాం. శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామ పరిధిలో ఉన్న చాకరి మెట్ల దగ్గర కూడా త్వరలో స్టాల్ ఏర్పాటు చేస్తాం.
-దేవులపల్లి పరమేశ్వరి, వున్ హ్యాండ్ ఫౌండేషన్ డైరెక్టర్
కోతులు బయటకు రాకుండా ఉంటాయి
వున్ హ్యాండ్ ఫౌండేషన్వారు మంచి ఆలోచనతో కోతుల కోసం ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయడం చాలా బాగుంది. దీనివల్ల కోతులు రోడ్లపైకి రాకుండా ఉంటాయి. వాహనాదారులకు ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఫారెస్ట్ దగ్గర ఉండటం వల్ల మా గ్రామంలో కోతుల బెడద ఎక్కువ. పంటలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. -విజయ, సర్పంచ్, కాగజ్ మద్దూర్, మెదక్ జిల్లా
