పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు టౌన్‌లోని అంబేద్కర్ నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక నివాసి ఎద్దుల నాగమ్మ తన కుమారుడు కార్తీక్ పెళ్లి ఈనెల 1న ఉండడంతో, ఖర్చుల కోసం రూ. 80 వేల నగదును తన తోడికోడలైన ఎద్దుల సత్తెమ్మ ఇంట్లో భద్రపరిచారు.
బుధవారం రాత్రి సత్తెమ్మ ఆ నగదును సరిచూసుకుని, ఇంటికి తాళం వేసి నిద్రించడానికి తన మరదలి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం తిరిగి వచ్చి చూడగా, ఇంటి తాళం పగలగొట్టి, బీరువా ధ్వంసమై అందులోని రూ.80 వేలు కనిపించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
