- అటవీ సమీప గ్రామాల్లో సోలార్ లైటింగ్, గ్యాస్ సిలిండర్లు పంపిణీ!
- ఇప్పటికే రెండు గ్రామాల్లో సోలార్ స్ట్రీట్ లైట్ల ఏర్పాటు
- ప్రజా ప్రతినిధులు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల నుంచి గ్రామాల ఎంపికకు లిస్ట్ లు
- అడవులు, వన్యప్రాణి సంరక్షణకు బలమైన అడుగుపడే అవకాశం
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ ప్రజలకు దగ్గరయ్యేందుకు సామాజిక కార్యక్రమాలను చేపట్టనుంది. అటవీ ప్రాంత అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం, సహకారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. జిల్లాలోని సిర్పూర్(టి), ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎఫ్ఆర్వోలతో మొదటి దశ గ్రామాల ఎంపిక చేయనున్నారు. అటవీ సమీప గ్రామాల్లో ప్రజలు అడవుల మీదే ఆధారపడకుండా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపడంతో పాటు ప్రజల కనీస అవసరాల కల్పనపై ఫోకస్ పెట్టనున్నారు. మరోవైపు పులులు, అరుదైన పక్షుల సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. ఇప్పటికే కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో రెండు మారుమూల గ్రామాల్లో సోలార్ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు.
ప్రజల అవసరాలు తీర్చేలా..
సోషల్ యాక్టివిటీలో భాగంగా పెంచికల్ పేట్ రేంజ్ పరిధిలోని నందిగాం, మురళీగూడ గ్రామాల్లో సోలార్ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. త్వరలోనే అటవీ సమీప గ్రామాల ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయించి సిలిండర్లు పంపిణీ చేయనున్నారు. దీనివల్లవంట చెరుకు కోసం ప్రజలు అడవులను నరికివేయడం తగ్గుతుందని, అడవిలో సంచారం కూడా గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి పందులు వంటి వన్యప్రాణులు అధికంగా సంచరిస్తున్న సమయాల్లో వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. చెట్ల నరికివేత తగ్గి అటవీ సంపద సంరక్షణకు దోహద పడుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు శుద్ధమైన జలం అందించేందుకు ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టారు.
సోలార్ లైట్ల ఏర్పాటుపై నజర్..
అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో రాత్రి వేళల్లో కరెంట్కోతలతో చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఉంది. వానాకాలంలో రోజుల తరబడి కరెంట్ లేకుండా గడపాల్సి వస్తోంది. ఈక్రమంలో సోలార్ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో ధైర్యాన్ని నింపడంతో పాటు వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. సోలార్ స్ట్రీట్లైట్లు ఏర్పాటు చేసిన నందిగాం, మురళీగూడ గ్రామాల సమీపంలో పెద్దవాగు, -ప్రాణహిత సంగమ ప్రాంతంలో అంతరించి పోతున్న పొడుగు ముక్కు రాబందుల స్థావరం ఉంది.
ఈ అరుదైన పక్షుల సంరక్షణకు గ్రామీణ ప్రాంత ప్రజల సహకారం అవసరం. జీవ వైవిధ్య పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అటవీ శాఖ చర్యలు తోడ్పడనున్నాయి. అటవీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజల్లో అటవీ శాఖపై విశ్వాసం పెరిగి, వన్యప్రాణుల వేట, చెట్ల నరికివేత వంటి వాటిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. అటవీ సంరక్షణ కోణంలో చేపట్టిన ఈ కార్యక్రమాలు జిల్లాలో సత్ఫలితాలు ఇస్తాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రజలకు సహకరిస్తాం..
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అడవుల అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ కోసం శాఖాపరంగా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్తున్నాం. అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో ప్రజలకు సహకారం అందించాలనే ఉద్దేశంతో సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. గ్యాస్ కనెక్షన్లు, ఆర్వో ప్లాంట్లు, సోలార్ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఎస్బీఐ అధికారులు ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. -నీరజ్ కుమార్ టిబ్రేవాల్, డీఎఫ్ వో, ఆసిఫాబాద్
