స్టాక్ మార్కెట్‌లో బుల్స్ జోరు.. ఆ స్టాక్స్ ఎగబడి కొన్న ఇన్వెస్టర్లు..

స్టాక్ మార్కెట్‌లో బుల్స్ జోరు.. ఆ స్టాక్స్ ఎగబడి కొన్న ఇన్వెస్టర్లు..

గురువారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. గత 3 రోజులుగా కొనసాగుతున్న నష్టాలకు బ్రేక్ వేస్తూ.. ఇన్వెస్టర్లు వాల్యూ బైయింగ్ పై మొగ్గు చూపడంతో మార్కెట్లు కళకళలాడాయి. ఉదయం నుంచే సానుకూల ధోరణితో ప్రారంభమైన సూచీలు, ముగిసే సమయానికి మరింత పుంజుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 899 పాయింట్లు లాభపడి 80,015 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 285 పాయింట్ల పెరుగుదలతో 24,765 వద్ద స్థిరపడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా దాదాపు 1.6% మేర లాభపడి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.

మార్కెట్లు లాభపడటానికి ప్రధాన కారణాలు:

1. గ్లోబల్ మార్కెట్ల మద్దతు: అమెరికా మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు.. ముఖ్యంగా జపాన్, సౌత్ కొరియా బలంగా కోలుకోవడం భారత మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది.
2. వాల్యూ బైయింగ్: గత కొన్ని సెషన్లలో మార్కెట్లు భారీగా పడిపోవడంతో.. నాణ్యమైన షేర్లు తక్కువ ధరకే లభించాయి. దీంతో ఇన్వెస్టర్లు తగ్గిన రేట్ల వద్ద కొనుగోళ్లు జరిపారు.
3. భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుదలపై ఆశలు: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల మధ్య, ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందన్న వార్తలు సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి.
4. పుంజుకున్న రూపాయి: డాలర్‌తో రూపాయి విలువ 61 పైసలు పెరిగి 91.54 వద్దకు చేరడం మార్కెట్‌కు కలిసొచ్చింది.

మెరిసిన రంగాలు - కొనుగోళ్ల జోరు:

ఈరోజు మార్కెట్ ర్యాలీలో మెటల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలు ముందు వరుసలో నిలిచాయి.
* మెటల్ రంగం: అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పెరగడంతో హిందాల్కో, టాటా స్టీల్, నేషనల్ అల్యూమినియం వంటి షేర్లు 4% నుంచి 6% మేర లాభపడ్డాయి.
* ఇన్‌ఫ్రా & ఎనర్జీ: అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా, NTPC షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరిపారు.

►ALSO READ | ముంబై వీధుల నుంచి రూ.300 కోట్ల కంపెనీ వరకూ.. శుభమ్ గుప్తా సక్సెస్ స్టోరీ ఇదే..

అయితే ఐటీ రంగం మాత్రం ఒత్తిడికి లోనైంది. టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్ వంటి షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. మొత్తానికి గత 3 రోజుల నష్టాల తర్వాత దలాల్ స్ట్రీట్ కోలుకోవడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. అయితే ముడి చమురు ధరలు, యుద్ధ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లలో అస్థిరత కొనసాగే అవకాశం ఉందని నిపుణులు ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు.