ముంబై వీధుల్లో ఒకప్పుడు తిండి కోసం కష్టపడుతూ తిరిగి దొరికిన పనల్లా చేసిన సాధారణ కుర్రాడు. నేడు దేశంలోని దిగ్గజ వ్యాపారవేత్తల ముందే నిలబడి తన కంపెనీ విలువ రూ.300 కోట్లు అని గర్వంగా చెప్పాడు. ఇది ఏదో సినిమా స్టోరీ కాదు బ్రదర్స్.. బోంకర్స్ కార్నర్ కంపెనీ వ్యవస్థాపకుడు శుభమ్ గుప్తా సాధించిన అద్భుత విజయం.
కన్నీళ్ల నుంచి మొదలైన ప్రయాణం
2011లో శుభమ్ జీవితం తలకిందులైంది. తండ్రి టెక్స్‌టైల్ వ్యాపారం దివాలా తీయడంతో కుటుంబం అంతా రోడ్డున పడింది. చేతిలో డిగ్రీ లేదు.. జేబులో చిల్లిగవ్వ లేదు. కానీ అతని కళ్లలో మాత్రం గెలిచి తీరాలనే కసి ఉంది. కాలేజీ చదువుల కంటే లోకాన్ని చదవడమే మిన్న అని భావించిన శుభమ్.. ముంబై వీధుల్లోనే వ్యాపార పాఠాలు నేర్చుకున్నాడు.
వీధి వ్యాపారం నుంచి బ్రాండ్ వైపు
చిన్న చిన్న పనులు చేస్తూ కూడబెట్టిన కొద్దిపాటి సొమ్ముతో టీ-షర్టుల వ్యాపారం మొదలుపెట్టాడు శుభమ్. బట్టల నాణ్యత, కస్టమర్ల అభిరుచులను నేరుగా తెలుసుకున్నాడు. 2014లో బోంకర్స్ కార్నర్ అనే పేరుతో తన కలల బ్రాండ్‌కు ప్రాణం పోశాడు. కేవలం బట్టలు అమ్మడం కాదు, యువత కోరుకునే యాటిట్యూడ్ ను అందించడమే లక్ష్యంగా తన వ్యాపారాన్ని ముందుకు నడిపించాడు.
►ALSO READ | మరోసారి ఉద్యోగులను లేఆఫ్ చేసిన అమెజాన్.. ఆ విభాగంలో వారికి పింక్ స్లిప్స్..
షార్క్ ట్యాంక్‌లో సంచలనం
భారీ మార్కెటింగ్ బడ్జెట్ లేకుండానే తన బ్రాండ్‌ను రూ.100 కోట్ల రెవెన్యూ స్థాయికి చేర్చాడు. రీసెంట్‌గా 'షార్క్ ట్యాంక్ ఇండియా' వేదికపై రూ.1.5 కోట్ల పెట్టుబడి కోసం 0.5% వాటాను ఆఫర్ చేశాడు. అంటే అతని కంపెనీ విలువ అక్షరాలా 300 కోట్లు. ఏడాదికి 30 కోట్ల లాభం వస్తుంటే.. మా దగ్గరికి ఎందుకు వచ్చావు? అని షార్క్ అనుపమ్ మిట్టల్ ఆశ్చర్యపోయారు.
అనుపమ్ అడిగిన ప్రశ్నకు శుభమ్ చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. తనకు డబ్బు అవసరం లేదని, కంపెనీని మరింత విస్తరించడానికి సరైన వ్యూహం, టెక్నాలజీ సాయం కావాలని నిజాయితీగా చెప్పాడు. అతని పట్టుదలకు ముగ్ధురాలైన నమితా థాపర్, అతను అడిగిన డీల్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాధారణ స్థాయి నుంచి జర్నీ స్టార్ట్ చేసిన శుభమ్ గుప్తా కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, డిగ్రీలు లేవని లేదా సరైన ఆర్థిక వనరులు లేవని బాధపడే వేలాది మంది యువతకు ఒక మార్గదర్శిగా నిలుస్తున్నాడు. కష్టపడే తత్వం ఉంటే ఆకాశమే హద్దుగా జీవితంలో కావాల్సినవన్నీ నేర్చుకుని సాధించవచ్చని అతని బిజినెస్ సక్సెస్ జర్నీ నిరూపిస్తోంది.
