మరోసారి ఉద్యోగులను లేఆఫ్ చేసిన అమెజాన్.. ఆ విభాగంలో వారికి పింక్ స్లిప్స్..

మరోసారి ఉద్యోగులను లేఆఫ్ చేసిన అమెజాన్.. ఆ విభాగంలో వారికి పింక్ స్లిప్స్..

టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి లేఆఫ్స్ బాట పట్టింది. ఈసారి సంస్థలోని అత్యంత కీలకమైన, భవిష్యత్ సాంకేతికతగా భావించే 'రోబోటిక్స్' విభాగంపై వేటు పడింది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అమెజాన్.. తాజాగా మరికొందరికి పింక్ స్లిప్స్ జారీ చేయటం ఉద్యోగుల్లో ఆందోళనలు పెంచేస్తోంది.

అమెజాన్ తన రోబోటిక్స్ విభాగంలో కనీసం 100 మందికి పైగా ఉన్నత స్థాయి ఉద్యోగులకు పింక్ స్లిప్స్ జారీ చేసింది. అమెజాన్ గోదాముల్లో వస్తువులను ప్యాక్ చేసి తరలించే ఆటోమేటెడ్ వ్యవస్థలను ఈ డివిజన్ రూపొందిస్తుంది. ఈ తొలగింపులను అమెజాన్ అధికారికంగా ధృవీకరించింది. సంస్థలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ చెబుతోంది.

బ్లూజే ప్రాజెక్ట్ నిలిపివేత:
తాజా లేఆఫ్స్ వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. అమెజాన్ ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'బ్లూ జే' అనే రోబోటిక్ ఆర్మ్ ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపివేసింది. గోదాముల్లో మనుషులతో కలిసి పని చేసేలా రూపొందించిన ఈ రోబోట్ పనితీరులో కొన్ని లోపాలు ఉండటం, అలాగే ఖర్చులు పెరగడంతో దీన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్న ఉద్యోగులనే ఇప్పుడు కంపెనీ ఇంటికి పంపిస్తోంది.

కొనసాగుతున్న లేఆఫ్స్:
అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ నేతృత్వంలో ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియ 2022 నుంచే మొదలైంది. ఇప్పటివరకు కంపెనీ దాదాపు 57వేల కంటే ఎక్కువ కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించింది. కేవలం ఈ 2026 జనవరిలోనే 16వేల మందిని ఇంటికి పంపింది. ఏఐ, ఆటోమేషన్ ద్వారా సామర్థ్యాన్ని పెంచుకుంటూ.. మానవ వనరుల అవసరాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా అమెజాన్ అడుగులు వేస్తోంది.

రోబోటిక్స్ విభాగం తమకు ఇప్పటికీ ప్రాధాన్యత కలిగిన రంగమేనని అమెజాన్ చెబుతున్నప్పటికీ.. కొనసాగుతున్న లేఆఫ్స్ మాత్రం టెక్ రంగంలో ఆందోళనలను పెంచేస్తున్నాయి. ఎఫెక్ట్ అయిన ఉద్యోగులకు అమెజాన్ సెవరెన్స్ పే, హెల్త్ ఇన్సూరెన్స్, కొత్త ఉద్యోగం వెతుక్కోవటంలో సాయం చేస్తామని హామీ ఇచ్చింది.