చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదని వ్యక్తి ఆత్మహత్య..మెదక్‌‌‌‌ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన

చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదని వ్యక్తి ఆత్మహత్య..మెదక్‌‌‌‌ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన
  • చిట్టీ ఏజెంట్‌‌‌‌, సర్పంచ్‌‌‌‌ భర్త ఇంటి ఎదుట మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన

శివ్వంపేట/మనోహరాబాద్, వెలుగు : చిట్టీ పాడి నాలుగు నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్‌‌‌‌ జిల్లా శివ్వంపేట మండలంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగయ్యపల్లికి చెందిన శ్రీశైలం యాదవ్‌‌‌‌ (40) మనోహరాబాద్‌‌‌‌ మండలం పోతారం సర్పంచ్‌‌‌‌ వినోద భర్త మహేందర్‌‌‌‌ వద్ద చిట్టీ వేశాడు. చిట్టి ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీశైలం యాదవ్‌‌‌‌ గురువారం సూసైడ్‌‌‌‌ నోట్‌‌‌‌ రాసిన అనంతరం పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

తనకు చిట్టీ డబ్బులు రూ. 50 వేలు రావాల్సి ఉందని, తన ఆరోగ్యం బాగా లేదని చెప్పినా మహేందర్‌‌‌‌ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, అందుకే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌‌‌‌ నోట్‌‌‌‌లో పేర్కొన్నాడు.

దీంతో శ్రీశైలం యాదవ్‌‌‌‌ కుటుంబ సభ్యులు, గంగయ్యపల్లి గ్రామస్తులు పోతారం గ్రామానికి వెళ్లి మహేందర్ ఇంటిని ముట్టడించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరకు మృతుడి కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు సర్పంచ్‌‌‌‌ భర్త మహేందర్‌‌‌‌ ఒప్పుకోవడంతో ఆందోళన విరమించారు. శ్రీశైలం భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు.