- హార్టికల్చర్ ద్వారా రైతులకు పంపిణీ
మంచిర్యాల, వెలుగు: పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీపై ప్లాస్టిక్ బుట్టలు, మామిడికాయలకు తొడిగే పేపర్ బ్యాగులు సప్లై చేస్తున్నారు. స్టేట్ ప్లాన్ కింద ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు 50 శాతం సబ్సిడీపై ప్లాస్టిక్ బుట్టలను పంపిణీ చేస్తున్నారు. ఎకరానికి గరిష్టంగా 40 బుట్టలు ఇస్తుండగా, జిల్లాకు 15 వేల యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో బుట్ట ఖరీదు రూ.337 కాగా, రైతులు 40 బుట్టల కోసం రూ.6,740 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మామిడికాయల నాణ్యత కోసం తొడిగే కవర్లను ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు ఎకరానికి 8 వేల కవర్లు అందిస్తోంది. వీటికోసం రూ.9 వేలు చెల్లిస్తే సరిపోతుంది.
కూరగాయల పందిళ్లు..
రాష్ట్రీయ కృషి వికాస్ స్కీం(ఆర్కేవీవై) కింద కూరగాయల సాగులో శాశ్వత పందిర్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని ద్వారా తీగ జాతి కూరగాయల సాగుకు ఒక్కో రైతు ఎకరానికి రూ.1,06,600 ఖర్చుతో పందిళ్లు నిర్మించుకుంటే, హార్టికల్చర్ ద్వారా 50 శాతం సబ్సిడీ కింద రూ.50 వేలు అందిస్తున్నారు. జిల్లాకు 50 యూనిట్లు మంజూరయ్యాయి. అలాగే చేలు, పొలంగట్లపై బౌండరీ ప్లాంటేషన్ కింద జిల్లాలోని 8 వేల వెదురు మొక్కలు సప్లై చేయనున్నారు. రెండేండ్ల వరకు నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒక్కో మొక్కను రాయితీపై రూ.150కి రైతులకు సప్లై చేస్తున్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ అనిత కోరారు.
