హైదరాబాద్: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారని చెప్పారు. కష్టపడిన కార్యకర్తలకు, ఆశీర్వదించిన ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు.
రెండేళ్ల తర్వాత ప్రజల్లోకి వెళితే సంపూర్ణంగా ఆశీర్వదించారని, 12 వేల 702 పంచాయతీల్లో 7 వేల 527 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 66 శాతం ఫలితాలను కాంగ్రెస్ సాధించిందని తెలిపారు. BRS, BJP కూటమి కట్టి పంచాయతీల్లో పోటీ చేశాయని సీఎం చెప్పారు. రెండు పార్టీలు కలిపి 33 శాతం మాత్రమే సాధించాయని ఎద్దేవా చేశారు.
పంచాయతీ ఫలితాలు రెండేళ్ల ప్రజా పాలనకు ప్రతిఫలం అని సీఎం రేవంత్ చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో 808 మంది కాంగ్రెస్ రెబల్స్ గెలిచారని సీఎం పేర్కొన్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ 8 వేల 335 సర్పంచులు గెలిచిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు.
పంచాయతీ లెక్కలతో చూసుకుంటే 94 సెగ్మెంట్లలో జరిగిన ఎన్నికల్లో 87 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ లీడ్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. BRS 6, BJP ఒక సెగ్మెంట్లోనే లీడ్ సాధించాయని చెప్పారు. 2029లో టూ బై థర్డ్ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
