హెల్త్‌కేర్ రంగంలోకి అంబానీ 'జియో': వెయ్యి రూపాయలకే DNA పరీక్షలు..!

హెల్త్‌కేర్ రంగంలోకి అంబానీ 'జియో': వెయ్యి రూపాయలకే DNA పరీక్షలు..!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో భారీ విప్లవానికి తెరలేపారు. టెలికాం రంగంలో అతి తక్కువ ధరకే డేటాను అందించి 'జియో'తో చూసిన సక్సెస్ మళ్లీ హెల్త్ కేర్ రంగంలో కూడా రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులను ముందే గుర్తించే 'జెనోమిక్ టెస్టింగ్' ధరలను భారీగా తగ్గించి, సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ గ్రూప్ నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.10వేల కంటే ఎక్కువగా ఉన్న ఈ పరీక్షల ధరను ఏకంగా రూ.వెయ్యి కంటే తక్కువకు అందించాలని అంబానీ ప్లాన్ చేస్తున్నారు.

జెనోమిక్ పరీక్షలు అంటే ఒక వ్యక్తి జన్యు క్రమాన్ని(DNA) విశ్లేషించడం. మన శరీరంలో భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి మొండి వ్యాధుల ముప్పును ఈ పరీక్షల ద్వారా ముందే పసిగట్టవచ్చు. ఇప్పటివరకు ఈ పరీక్షలు అత్యంత ఖరీదైనవి కావడంతో కేవలం సంపన్న వర్గాలకే పరిమితమయ్యాయి. అయితే రిలయన్స్ తన అనుబంధ సంస్థ 'స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్' (Strand Life Sciences) ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించి, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పరీక్షల వ్యయాన్ని 90% వరకు తగ్గించనుంది. 

ALSO READ : భారీ జీతాలున్నా సేవింగ్స్ చేయలేకపోతున్న నేటి తరం.. 

వాస్తవానికి భారత్ లాంటి భారీ జనాభా కలిగిన దేశంలో ఈ సేవలకు మంచి డిమాండ్ ఉంటుందని అంబానీ అంచనా వేస్తున్నారు. అయితే రేటే ఇక్కడ అన్నింటి కంటే ముఖ్యమైనది కావటంతో మరోసారి టెలికాం, బెవరేజెస్ రంగాల్లో లాగా పోటీని దాటి విజయం సాధించటానికి కొత్త వ్యూహంతో ఆరోగ్య రంగంలోకి ఎంట్రీకి అంబానీ యత్నిస్తున్నారు. 

ఈ ధరల తగ్గింపు వెనుక రిలయన్స్.. విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఖరీదైన డయాగ్నోస్టిక్ కిట్‌ల స్థానంలో, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కిట్‌లను వాడటం, ఏఐ సహాయంతో వేగంగా ఫలితాలను విశ్లేషించడం ద్వారా ఖర్చును తగ్గించాలని వ్యూహంగా పెట్టుకుంది. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, భారతీయుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక సామాజిక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ జెనోమిక్ టెస్టింగ్ అందుబాటులోకి వస్తే సామాన్యులు కూడా తమ ఆరోగ్య స్థితిగతులను ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది. వ్యాధి వచ్చాక చికిత్స చేయడం కంటే, రాకముందే నివారించడం మేలు అనే సూత్రాన్ని ఇది నిజం చేయనుంది. ఈ విప్లవాత్మక మార్పుతో డయాగ్నోస్టిక్స్ రంగంలో రిలయన్స్ తిరుగులేని శక్తిగా ఎదగడమే కాకుండా, సామాన్యుడికి నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయనుందని వైద్య రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.