మీ మొబైల్ రీఛార్జ్ మరింత ప్రియం కానుంది. అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇండియాలో టెలికాం కంపెనీలు త్వరలో మరోసారి టారిఫ్లను పెంచనున్నాయి. అదేనండీ.. రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడానికి టెలికాం కంపెనీలు మరోసారి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. 16 నుంచి 20 శాతం వరకూ ప్రస్తుతం ఉన్న రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నట్లు తెలిసింది. గడచిన ఎనిమిది సంవత్సరాల్లో నాలుగో సారి మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచేందుకు టెలికాం కంపెనీలు పూనుకోవడం గమనార్హం. 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లోనే.. అంటే 2026 ఏప్రిల్, మే నెలల్లో రీఛార్జ్ ప్లాన్ల ధరలను.. 4జీ, 5జీ ప్లాన్ల ధరలను పెంచే అవకాశం ఉంది.
Also Read : గూగుల్ పే మరో అడుగు: యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి 'రూపే' క్రెడిట్ కార్డ్ లాంచ్
2026లో జియో, ఎయిర్ టెల్, వీఐ కస్టమర్లు ఈ టారిఫ్ల భారం మోయక తప్పేలా లేదు. ఉదాహరణకు.. మీరు జియో కస్టమర్ అయితే.. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటాతో వచ్చే ప్లాన్ ప్రస్తుతం 299 రూపాయలుగా ఉంది. ఒకవేళ.. టారిఫ్ పెంచితే.. ఇదే ప్లాన్ 347 రూపాయల నుంచి 359 రూపాయల వరకూ వెళ్లే ఛాన్స్ ఉంది. మీరు.. ఎయిర్ టెల్ కస్టమర్ అయి ఉంటే.. 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న5జీ ప్లాన్ ప్రస్తుతం 349 రూపాయలు ఉంది. టారిఫ్ హైక్ తర్వాత.. ఈ ప్లాన్ 405 రూపాయల నుంచి 419 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉంది. 5Gలో పెట్టుబడులను పెంచుకునేందుకు కస్టమర్లపై టారిఫ్ల హైక్తో టెలికాం కంపెనీలు మోత మోగించేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం.
