ఇవాళ(ఫిబ్రవరి11) పోలింగ్ డే ..ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు

ఇవాళ(ఫిబ్రవరి11) పోలింగ్ డే ..ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు
  • 2,569 వార్డులు,  412 డివిజన్లకు జరగనున్న పోలింగ్
  • 52.17 లక్షల మంది ఓటర్ల కోసం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • మంగళవారం సాయంత్రానికే సామగ్రితో తరలిన సిబ్బంది
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్​ 
  • ప్రతి కేంద్రంలో వెబ్ కాస్టింగ్​.. 40 వేల మందికి పైగా సిబ్బంది విధులు
  • పోలింగ్​ శాతం పెంచేందుకు ఈసీ విస్తృత ప్రచారం 
  • గెలుపుపై ఎవరి ధీమా వారిదే

హైదరాబాద్, వెలుగు:  పోలింగ్​ డే వచ్చేసింది. నేటి మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2,569 వార్డులు,  412 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 8,191 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 52.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ జరుగుతుంది. 

ఎన్నికల నిర్వహణ కోసం 40 వేల మందికి పైగా సిబ్బందిని నియమించారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన బ్యాలెట్​ బాక్స్​లు, బ్యాలెట్​ పేపర్లు, ఇతర పోలింగ్​ సామగ్రితో మంగళవారం సాయంత్రమే తమకు కేటాయించిన పోలింగ్​ స్టేషన్లకు సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ప్రతీ పోలింగ్​ కేంద్రంలో సీసీ కెమెరాలతో వెబ్​ కాస్టింగ్​ చేస్తోంది. కాగా, పోలింగ్​ శాతం పెంపుపై ఈసీ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇందుకోసం 3 ఏఐ వీడియోలను వాట్సప్​ గ్రూప్​లలో, లోకల్​ చానల్స్​లో సర్క్యులేట్​ చేస్తోంది. పోలింగ్​కు  టైం దగ్గర పడడంతో పార్టీలన్నీ పోల్​ మేనేజ్​మెంట్​పై దృష్టి సారించాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం లీడర్లంతా కృషి చేస్తున్నారు. విజయావకాశాలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఇద్దరు కార్పొరేటర్లు, 12 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవం

రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​రాణి కుముదిని జనవరి 27న షెడ్యూల్​ రిలీజ్​ చేశారు. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డులకు  ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. గెలిచిన అభ్యర్థులతో ఫిబ్రవరి 16న పరోక్ష పద్ధతిలో మేయర్, చైర్​ పర్సన్​ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఈ క్రమంలో జనవరి 28 నుంచి 30 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.  ఫిబ్రవరి 4న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తయింది. అదే రోజు ఇద్దరు కార్పొరేటర్లు, 12 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవమైనట్టు ప్రకటించారు. ఇక నారాయణ పేట జిల్లా మక్తల్​ మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఎ.మహదేవప్ప మంగళవారం ఆత్మహత్య చేసుకోగా,  ఇక్కడ పోలింగ్​ను వాయిదా వేసినట్టు రిటర్నింగ్​ ఆఫీసర్ పాలెం శివయ్య ప్రకటించారు. ఇవిపోగా మిగతా 412 డివిజన్లలో కార్పొరేటర్లు, 2,569 వార్డులలో కౌన్సిలర్ల ఎన్నిక కోసం నేడు(బుధవారం) పోలింగ్​ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల కమిషనర్​రాణి కుముదిని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.   

పోలింగ్​ కేంద్రాలకు తరలిన సిబ్బంది

మున్సిపల్​ ఎన్నికలను ఈ సారి బ్యాలెట్​ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ జరుగుతుంది. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది మంగళవారం సాయంత్రమే తమకు కేటాయించిన పోలింగ్​ స్టేషన్లకు సామగ్రితో తరలివెళ్లారు. పోలీస్​ ఎస్కార్ట్  సహాయంతో ప్రత్యేక వాహనాల్లో బ్యాలెట్​ బాక్సులతో కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికలు నిర్వహిస్తున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మంగళవారం పోలింగ్​ సామగ్రి డిస్ట్రిబ్యూషన్​ కార్యక్రమం  పకడ్బందీగా నిర్వహించారు. అదనపు జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్​ కమిషనర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్​ ఎన్నికల కోసం మొత్తం 16 వేల382 బ్యాలెట్​ బాక్స్​లను వినియోగిస్తున్నాం. ఎన్నికల విధులలో 1,379 మంది రిటర్నింగ్​ ఆఫీసర్లు(ఆర్వో)లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్​ ప్రిసైడింగ్​ఆఫీసర్లు, పోలింగ్​ సిబ్బంది అంతా కలిపి 41 వేల773 మంది విధులలో పాల్గొంటున్నారు”అని  ఎన్నికల కమిషనర్​ ప్రకటించారు. 

పోలింగ్​ శాతం పెంపుపై ఈసీ విస్తృత ప్రచారం 

మున్సిపల్​ ఎన్నికల్లో పోలింగ్​ శాతం పెంచేందుకు  రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఈసీ ఆధ్వర్యంలో  మూడు ఏఐ వీడియోలను రూపొందించి వాట్సప్​ గ్రూప్​లలో షేర్​ చేశారు. అలాగే, లోకల్​ చానెల్స్​లో ప్రసారం చేయిస్తున్నారు. ‘‘ఓటర్లకు విజ్ఞప్తి.. మున్సిపల్​ 2వ సాధారణ ఎన్నికల్లో ప్రతి ఓటరు ఉత్సాహంగా పాల్గొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీ ఓటే మీ గొంతు. అది స్థానిక పాలనను బలోపేతం చేయడంలో.. మీ మున్సిపాలిటీ, కార్పొరేషన్ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. భయం, సంకోచం లేకుండా ముందుకు వచ్చి బాధ్యతాయుతంగా ఓటు వేయండి. అధిక సంఖ్యలో, స్వేచ్ఛాయుతంగా ఓటింగ్ జరిగేలా కలిసి పనిచేసి పారదర్శక, శాంతియుత, ప్రజాస్వామ్య ఎన్నికలకు మన వంతు సహకారం అందిద్దాం’’ అంటూ ఆ వీడియోలలో ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఫొటో ఓటర్​ స్లిప్పుల పంపిణీని కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ప్రతీ ఓటరు ఇంటికి వెళ్లి వాటిని అందజేశారు. ఓటర్​ స్లిప్పులు అందని వారు ఎన్నికల సంఘం రూపొందించిన ‘టీఈ పోల్​’ డౌన్​లోడ్​ చేసుకొని అందులో తమ ఎపిక్​ నంబర్​ సహాయంతో ఓటర్​ స్లిప్​ డౌన్​లోడ్​ చేసుకోవచ్చని కమిషనర్​ రాణి కుముదిని ప్రకటించారు. ఈ యాప్​ ద్వారా పోలింగ్​ కేంద్రాల వివరాలు కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. పోలింగ్​ ముగిసేంత వరకు సంబంధింత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీఎన్​ఎస్​ఎస్​ సెక్షన్​ 163 అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నంబర్ 9240021456 కి కాల్​ చేసి చెప్పవచ్చని తెలిపారు. 

గెలుపోటములపై ఎవరి ధీమా వారిదే!

మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపోటములపై ఆయా పార్టీల నేతలు  ఎవరి ధీమాలో వారున్నారు. ఆరు రోజులుగా జరిగిన ప్రచారం, ఆ తర్వాత చేపట్టిన పోల్​ మేనేజ్​మెంట్​ను ఆధారం చేసుకొని  గెలుపు మాదంటే.. మాదేనని చెప్తున్నారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్​ రెడ్డి రంగంలోకి దిగి ఐదు బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తమకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.  రాష్ట్ర మంత్రులు తమకు కేటాయించిన పార్లమెంట్​స్థానం పరిధిలోని మున్సిపాలిటీల ఎన్నికల బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకొని పనిచేశారు. పీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్, ఎమ్మెల్యేలు, సీనియర్లంతా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్​ రెడ్డితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే, బీజేపీ ఎంపీలంతా కూడా తమ నియోజకవర్గాల పరిధిలో పోటాపోటీగా క్యాంపెయినింగ్​ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబిన్​ రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడాన్ని బట్టి ఈ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.​ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు సైతం రాష్ట్రమంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్​ఫాంహౌస్​కే పరిమితం కాగా, ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్​రావు పార్టీ భారాన్నంతా మోశారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఆ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. 

8,191 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు

మున్సిపల్​ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 52 లక్షల 17 వేల 413 మంది కాగా, వీరిలో పురుషులు 25 లక్షల 49 వేల 750 , మహిళలు 26 లక్షల 67 వేల 25 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మొత్తం 8,191 పోలింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషనర్​ ప్రకటించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలతో వెబ్​ కాస్టింగ్​కు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్​ ఎన్నికల కోసం 4 వేల 150 మందిని పోలీసులు బైండోవర్​ చేశారు. 1,183 లైసెన్స్​ ఆయుధాలను స్వాధీనంచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.  ఈ ఎన్నికల సందర్భంగా చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్న వారి నుంచి రూ.1.19 కోట్ల నగదు, రూ.1.04 కోట్ల విలువ చేసే మద్యం, రూ.15.68 లక్షల విలువ చేసే డ్రగ్స్​, మత్తుపదార్థాలు, రూ.16.29 లక్షల విలువ చేసే లోహాలు, ఆభరణాలు, రూ.11.02 లక్షల విలువ చేసే ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టుగా ఎన్నికల సంఘం కమిషనర్​ రాణికుముదిని మంగళవారం ప్రకటించారు.