మున్సిపోల్స్ కు అంతా రెడీ..ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు, 402 వార్డులకు ఎన్నికలు

మున్సిపోల్స్ కు అంతా రెడీ..ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు, 402 వార్డులకు ఎన్నికలు

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 19 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 409 వార్డులకు 1,486 మంది బరిలో ఉన్నారు. బుధవారం ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. 

మెదక్ జిల్లాలో..

జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 75 వార్డులు ఉండగా మెదక్ లో ఒక వార్డు ఏకగ్రీవమైంది. అది పోను 74 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 86,109 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 41,516, మహిళలు 44,591 పురుషులు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఒక్కో వార్డుకు రెండు చొప్పున మొత్తం 148 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 180 మంది పీవో లు, 180 మంది ఏపీవోలు, 502 మంది ఓపీవోలను నియమించారు. 21 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. నాలుగు మున్సిపాలిటీల్లో 686 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంగారెడ్డి జిల్లాలో..

జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో 256 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 541 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం పోలింగ్ సామగ్రితో ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. 1,100 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. 11 మున్సిపాలిటీల్లో మొత్తం 3,41,808 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1,71,151, మహిళలు 1,70,638, ఇతరులు 19 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

పోలింగ్ నిర్వహణకు 103 మంది రిటర్నింగ్ అధికారులు, 103 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 649 మంది ప్రిసైడింగ్ అధికారులు, 649 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 1,948 మంది ఇతర అధికారులు, 73 మంది మైక్రో అబ్జర్వర్లు, 49 మంది జోనల్ ఆఫీసర్లను నియమించారు.

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలోని చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీల్లోని 72 వార్డులకు 326 మంది పోటీ చేస్తుండగా 1,01,85  లక్షల  మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో పురుషులు 48,968, మహిళలు 52,110 ఇతరులు ఏడుగురు ఉన్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో  మొత్తం 176 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1,069 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.

పోలింగ్ పర్యవేక్షణకు 18 రూట్లలో  22 మంది జోనల్ అధికారులను నియమించారు. 31 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి  31  మంది మైక్రోఅబ్జర్వర్లను  నియమించారు. చేర్యాలకు 147 మంది,  హుస్నాబాద్ కు 240, దుబ్బాకకు 246, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కు 436 మందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.