గూగుల్ పే మరో అడుగు: యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి 'రూపే' క్రెడిట్ కార్డ్ లాంచ్

గూగుల్ పే మరో అడుగు: యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి 'రూపే' క్రెడిట్ కార్డ్ లాంచ్

డిజిటల్ పేమెంట్ రంగంలో అగ్రగామిగా ఉన్న గూగుల్ పే ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తో జతకట్టి సరికొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ను లాంచ్ చేసింది. రూపే నెట్‌వర్క్‌పై పనిచేసే ఈ కార్డ్.. వినియోగదారులకు డిజిటల్ పేమెంట్లలో సరికొత్త అనుభూతిని అందించనుంది.

ఈ క్రెడిట్ కార్డ్ రూపే నెట్‌వర్క్‌పై వస్తున్నందున.. దీనిని నేరుగా గూగుల్ పే యాప్‌కు లింక్ చేయవచ్చు. అంటే మీ దగ్గర నగదు లేదా డెబిట్ కార్డ్ లేకపోయినా ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా నేరుగా క్యూఆర్కోడ్‌ను స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేసేయెుచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. పైగా గూగుల్ పే యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంలో వస్తున్న ఈ కార్డ్ ద్వారా వినియోగదారులు చేసే చెల్లింపులకు బోలెడు ప్రయోజనాలు ఉండనున్నాయి. 

గూగుల్ పే యాప్ ద్వారా చేసే మొబైల్ రీఛార్జ్, డిష్ టీవీ బిల్లులు, కరెంట్ బిల్లుల చెల్లింపులపై భారీగా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక జొమాటో, స్విగ్గీ , ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ కార్డ్‌ ఉపయోగించి చేసే ఖర్చులపై అదనపు రివార్డులు అందుకోవచ్చు. అలాగే కార్డు హోల్డర్లు విమాన ప్రయాణాల సమయంలో ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ప్రీమియం ఫీచర్లను కూడా ఇందులో ఆఫర్ చేయబడ్డాయి. 

అర్హత కలిగిన వినియోగదారులు నేరుగా Google Pay యాప్‌లోకి వెళ్లి క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. అప్లికేషన్ ఆమోదం పొందిన వెంటనే.. వర్చువల్ కార్డ్ లభిస్తుంది. దీనితో మీరు తక్షణమే ఆన్‌లైన్ షాపింగ్ ప్రారంభించవచ్చు. ఇప్పటికే 'Ace' పేరుతో గూగుల్ పే-యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అందుబాటులో ఉన్నప్పటికీ.. తాజా రూపే వెర్షన్ యూపీఐ ఫ్లెండ్లీ పేమెంట్ ఆప్షన్స్ అందించటంతో సామాన్య వినియోగదారులకు మరింత చేరువకానుంది. ఇది క్రెడిట్ కార్డుల వినియోగాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, క్యాష్‌బ్యాక్స్ పొందే అవకాశాన్ని అందించనుంది.